భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్‌   

భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్‌   

భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. ఇతర దేశాల మాదిరిగానే భారత్‌ కూడా వ్యాక్సిన్‌ ప్రయత్నాల్లో నిమగ్నమైందని, మూడు దేశీ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.

ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో నిపుణుల బృందం ఈ ప్రక్రియను పర‍్యవేక్షిస్తోందని, ప్రణాళికాబద్ధంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. రాజ్యసభలో గురువారం హర్షవర్ధన్‌ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఆరంభం నాటికి భారత్‌లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. 

భారత్‌లో జైడస్‌ క్యాడిలా, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌లు రెండూ తొలి దశ పరీక్షలను పూర్తి చేసుకున్నాయి. ఇక డీసీజీఐ అనుమతులు లభించిన వెంటనే ఆస్ర్టాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసే వ్యాక్సిన్‌ రెండు, మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సిద్ధమైంది.

కాగా, బాధ్యతా రాహిత్యంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తి జరుగుతోందని మంత్రి హర్షవర్ధన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్‌లాక్‌ నాటి నుంచి ప్రజలు వైరస్‌ తగ్గిందని, మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని భావించారని, దీంతో వైరస్‌ వ్యాప్తి జరుగుతోందని పేర్కొన్నారు. వ్యాక్సి్‌న్‌ అందుబాటులోకి వచ్చే వరకు మాస్క్‌, భౌతిక దూరమే సామాజిక టీకాలని స్పష్టం చేశారు.

కొవిడ్‌ పరీక్షల్లో త్వరలోనే అమెరికాను దాటనున్నట్లు మంత్రి  తెలిపారు. వలస కార్మికులు కొంతకాలంగా సమస్యలను ఎదుర్కొన్నారని, అయితే వారికి సహాయమందించేందుకు కేంద్ర హోంశాఖ, రైల్వేలు గణనీయమైన చర్యలు తీసుకున్నాయని హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు.

జనవరి 8 నుంచి ప్రధానమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రులు కరోనా మహమ్మారి పరిస్థితిపై సమీక్షిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రులంతా ప్రధానితో కలిసి మహమ్మారిపై పోరాటం చేశారని తెలిపారు. జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నిర్ధారణ అయ్యిందని, అప్పటి కంటే ముందు నుంచే అన్ని రకాల సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. మొదటి పాజిటివ్‌ కేసును గుర్తించిన సమయంలో 162 కాంటాక్ట్‌లను గుర్తించినట్లు చెప్పారు.

మొత్తం పరిస్థితిని పర్యవేక్షించినందుకు ప్రధాని నరేంద్రమోదీని చరిత్ర గుర్తుంచుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీ ఆనంద్‌ శర్మ ప్రశ్నకు సమాధానమిస్తూ ఐదు శాస్త్రీయ సంస్థలు డేటాను ఇచ్చాయని, వాటి ఆధారంగా 14-29లక్షల కేసులను లాక్‌డౌన్‌ ద్వారా నిరోధించినట్లు చెప్పారు. లాక్‌డౌన్‌లో సుమారు 1,700 ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్‌మెంట్‌ను ఎక్కడ మోహరించాలనే విషయంలో ‘ఏ పార్టీ అధికారంలో ఉన్నదో ప్రధాని చూడలేదని, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, నోయిడాలో కోబాస్‌ మిషన్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఫిబ్రవరి, మార్చిలో మేం సామర్థ్యాన్ని పెంపొందించుకునే పని చేశాం’ అని చెప్పారు.