కూల్చివేతపై గవర్నర్‌కు కంగనా ఫిర్యాదు

మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారితో బాలీవుడ్‌ నటి  కంగనా రనౌత్‌ భేటీ అయి అకారణంగా తన కార్యాలయాన్నికూల్చివేయడంపై గవర్నర్‌కు కంగనా ఫిర్యాదు చేశారు. వీరి భేటీ దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే వీడియో కాన్ఫరెన్స్‌ జరిగిన రెండు గంటల తర్వాత వీరి భేటీ జరుగడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

ముంబైలోని తన కార్యాలయం కూల్చివేసిన నాలుగు రోజుల తరువాత కంగనా రనోత్ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలుసుకున్నారు. ఆమెతో పాటు సోదరి రంగోలి కూడా భేటీలో పాల్గొన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం గవర్నర్‌ను కలుసుకోవడానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. 

“నాకు జరిగిన అన్యాయం గురించి, మహారాష్ట్ర ప్రభుత్వ అవమానం గురించి మాత్రమే గవర్నర్‌తో మాట్లాడాను” అని ఆమె చెప్పారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు  కంగనా పేర్కొన్నారు.

ముంబైలోని పాలి హిల్‌లోని మణికర్నిక ఫిల్మ్స్ కార్యాలయాన్ని సెప్టెంబర్ 9 న బీఎంసీ అధికారులు రెండు గంటలపాటు కూల్చివేతలు చేపట్టారు. ఈ చర్యకు వ్యతిరేకంగా కంగనా హైకోర్టుకు వెళ్లడంతో బీఎంసీ తమ చర్యలను నిలిపివేసింది. 

ముంబై నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఇంత కఠిన చర్యలు చూపిస్తే ముంబై మరోలా ఉండేదని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. తన కార్యాలయాన్ని కూల్చివేసిన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా రనౌత్‌ మాటల దాడి చేస్తూనే ఉన్నారు.

 ఇలా ఉండగా, నటి కంగన వెనుక బీజేపీ ఉందంటూ ఆరోపణలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై ఆమె ఈ ఉదయం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 
‘‘డ్రగ్ రాకెట్ మాఫియాను బద్దలు కొట్టిన వారికి బీజేపీ మద్దతివ్వడం అత్యంత దురదృష్టకరం. దీనికి బదులుగా పరువు తీసి, అత్యాచారాలు, దాడులు చేసే శివసేన గూండాలకు మద్దతివ్వాలి. డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ మహిళకు మద్దతివ్వడానికి బీజేపీకి ఎంత ధైర్యం? అంతే కదా సంజయ్ జీ’’ అంటూ ట్విట్టర్ వేదికగా కంగన వ్యంగ్యాస్త్రాలు సంధించింది.