ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో విద్యుత్ కొరత తీరుస్తానని అంటూ ముందు, వెనుక చూడకుండా చత్తీస్గఢ్ నుండి విద్యుత్ కోసం కె చంద్రశేఖరరావు చేసిన హడావిడి, చేసుకున్న ఒప్పందాలు ఇప్పుడు డిస్కంలకు భారంగా మారాయి. రూ 261 కోట్ల మేరకు పరిహారం చెల్లింపవలసిన పరిస్థితి ఏర్పడింది. హడావుడి చేయడం మినహా, నిర్దుష్టమైన ప్రణాళికలు ఏవీ కేసీఆర్ వేయరని అనడానికి ఇదే దృష్టాంతంగా మిగిలింది.
చత్తీస్గఢ్ నుండి ఎక్కువ ధరకు విద్యుత్ కొనడంతో పాటు అక్కడి నుండి విద్యుత్ తీసుకు రావడానికి మార్గం లేకపోవడంతో హడావుడిగా విద్యుత్ (లైన్) కారిడార్ కోసం ఆగమాగం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు డిస్కంల మెడకు చుట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు చర్యల కారణంగా పవర్గ్రిడ్ కార్పొరేషన్కు రూ. 261 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది.
త్తీస్గఢ్లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. తెలంగాణ, చత్తీస్‌గఢ్ సీఎంల మధ్య ఎంవోయూ జరిగింది. చత్తీస్‌గఢ్ నుంచి మరో 1,000 మెగావాట్లను కొనుగోలు చేస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అప్పటివరకు రెండు రాష్ట్రాలను లింక్ చేసే విద్యుత్ కారిడార్ లేదు. ఆ సమయంలో ఈస్టర్న్, నార్తర్న్, సదరన్ రీజియన్కు లింక్చేసే వార్ధా–నిజామాబాద్ 765 కేవీ డబుల్ సర్క్యూట్ పవర్ ట్రాన్సిమిషన్ లైన్ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిర్మిస్తోంది. ఈ కారిడార్ కెపాసిటీ 4,200 మెగావాట్లు. అందులో వెయ్యి మెగావాట్ల కారిడార్ తెలంగాణ అడ్వాన్సుగా బుక్ చేసుకుంది.
చత్తీస్‌గఢ్ నుంచి మరో 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు మరో వెయ్యి మెగావాట్ల కారిడార్‌ను ఆ తర్వాతి కాలంలో బుక్ చేసుకుంది. 2017 మార్చి చివర్లో కారిడార్నిర్మాణం పూర్తయింది. అప్పట్నుంచీ ఈ కారిడార్ను వినియోగించుకొని చత్తీస్గఢ్ పవర్ను తెలంగాణకు తెచ్చుకునే లైన్ క్లియరైంది.
తొలి ఎంవోయూ మేరకు 1,000 మెగావాట్ల విద్యుత్ కోటాలో కొంత మొత్తాన్ని అవసరమైనప్పుడు డిస్కం వినియోగించుకుంటోంది. రెండో విడత వెయ్యి మెగావాట్ల పవర్ వాడుకునేందుకు అడ్వాన్స్గానే పవర్ గ్రిడ్ కారిడార్ ను బుక్ చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఆ రెండో వెయ్యి మెగావాట్ల లైన్లను 2018 ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవాలి.
కానీ ఇప్పటికీ ఒక్క యూనిట్కూడా ఈ లైన్ల ద్వారా తెచ్చుకోలేదు. ఇది తమకు అవసరం లేదని, ఈ కారిడార్ను వదులుకుంటామని అదే ఏడాది ఫిబ్రవరి 19న పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు డిస్కంలు లేఖ రాశాయి. కానీ ఒకసారి లైన్లను బుక్ చేసుకున్న తర్వాత వదులుకుంటే నిర్మాణానికి రూ. వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన పవర్ గ్రిడ్ నష్టపోతుంది. ఈ నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని పవర్ గ్రిడ్ ఒప్పందంలో ఉంది.
దీంతో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం టీఎస్‌ఎస్పీడీసీఎల్ నుంచి తమకు రూ. 261 కోట్ల పరిహారం రావాలని పవర్ గ్రిడ్ లెక్కగట్టింది. దీంతో సదరన్ డిస్కంకు పవర్ గ్రిడ్ ఇచ్చిన నోటీసుల షాక్ తగిలినట్లయింది.
తొందరపాటుతో కారిడార్ను అడ్వాన్స్గా బుక్ చేసుకోవటంతో కోట్లల్లో జరిమానా చెల్లించాల్సి రావటం అదనంగా భారంగా మారినట్లయింది. అక్కరలేని కారిడార్కు భారీగా డిస్కంలు మూల్యం చెల్లించినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్