ఫింగర్‌-4 కొండలపై భారత  దళాల పాగా 

తూర్పు లద్దాఖ్‌లోని ప్రశాంతమైన పాంగాంగ్‌ సరస్సు వద్ద తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ తమ  ఆధిపత్యం కోసం చైనా దళాలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నా భారత్ దళాలు మాత్రం భరోసాతో స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఫింగర్‌-4 వద్ద ఉన్న కొండలపై భారత దళాలు పాగా వేశాయి.

పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో ఫింగర్‌-4 వద్ద గతంలో ఆక్రమించిన కొన్ని మిట్టలను చైనా ఖాళీ చేసి ఉత్తరాన ఎక్కువగా మోహరించింది. దీంతో భారత బలగాలు ఆలస్యం చేయకుండా వీటిని స్వాధీనపరుచుకున్నాయి.

కాగా కీలకమైన రెజాంగ్‌ లా సమీపానికి రెండు రోజుల కిందట కత్తులు, బరిసెలు, ఈటెలు, గ్వువాండో (చైనా మార్షల్‌ ఆర్ట్స్‌లో వాడే కత్తులు)లతో వచ్చిన దళం ఇంకా అక్కడే తిష్టవేసి ఉన్నట్లు  సమాచారం. మరోవైపు ఇరుదేశాల కమాండర్ల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

ఇదిలా ఉండగా లద్దాఖ్‌లో చైనా కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ చైనాకు శత్రువైన జపాన్‌తో భారత్‌ చేయికలిపింది. ఓ కీలకమైన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రెండు దేశాల ప్రధానులు ఈ సందర్భంగా సమాలోచనలు జరిపారు.

పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) దాదాపు 50 వేల మంది సైనికులతో బలగాల్ని తూర్పు లద్దాఖ్‌ ఆపరేషన్‌కు తరలించింది. అయితే భారత్‌ కూడా పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. తన దళాలను నిరంతరం పెంచుకుంటూ  చైనా బలగానికి దీటుగా భారత దళాలు కూడా భారీగానే మోహరించాయి.

రేయింబవళ్లూ అప్రమత్తంగా ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. భారత దళాల్లో ఎత్తయిన ప్రదేశాల్లో, కొండలపైనా యుద్ధం చేయడంలో నైపుణ్యం ఉన్న ప్రత్యేక దళాలు ఉన్నాయని ఓ సైనికాధికారి వెల్లడించారు.

చైనా సైనిక వాహనాలు, ఫిరంగి దళాలు  నిరంతరం సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల వద్ద సంచరిస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త రక్షణ వ్యవస్థలను రంగంలోకి చైనా దింపుతోంది. 

ఇవన్నీ మనకు అతి సమీపానికి వస్తూ పోతూ ఉన్నాయి. ఎక్కువగా భారత దళాలను బెదిరించే లక్ష్యమే! మొత్తం మీద.పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని సీనియర్‌ రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు.