తాజా, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలపై 4,442 కేసులు   

చట్టసభల్లో నేరచరితులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తాజా, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలపై దేశవ్యాప్తంగా 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఉన్న కేసులపై అధ్యయనం జరిపిన అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సరియా సంబంధిత నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచారు. 
 
వీరిలో ప్రస్తుతం చట్టసభలో ఉన్న ప్రజాప్రతినిధులపై 2,556 కేసులున్నాయి. యావజ్జీవిత ఖైదు శిక్షార్హమైన తీవ్ర నేరాలకు సంబంధించి 413 కేసులున్నాయి. ఇందులోని 174 కేసులలో సిట్టింగ్ ఎంపీలు / ఎమ్మెల్యేలు నిందితులుగా ఉండడం గమనార్హం.
 
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదంటూ హక్కుల ఉద్యమకారుడు అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో సహాయం చేసేందుకుగానూ సుప్రీంకోర్టు అమికస్‌క్యూరీగా సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సరియాను నియమించింది. 
 
ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్స్‌ సమర్పించిన సమాచారం ఆధారంగా హన్సరియా ఈ అఫిడవిట్‌ సమర్పించారు. కాగా, పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల్లో విచారణలను వేగవంతం చేయాలని సుప్రీం సూచించింది. 
 
దీంతోపాటు కేసులకు సంబంధించిన సమాచారాన్ని పట్టికరూపంలో ఉంచాలని అమికస్ క్యూరీ విజయ్ హన్సరియా, న్యాయవాది స్నేహ కలితలను కోరింది. సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. 
 
యూపీలో అత్యధికంగా నేరచరిత గల ప్రజాప్రతినిధులున్నారు. మొత్తం 1,217 కేసులుండగా, ఇందులో 446 మంది సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారు. జీవిత ఖైదుకు శిక్షార్హమైన కేసులు 116 ఉన్నట్లు అమికస్‌ క్యూరీ వివరించారు. 
 
బీహార్‌లో 531, తమిళనాడు 324, మహారాష్ట్ర 330, ఒడిశా 331, మధ్యప్రదేశ్ 184, ఆంధ్రప్రదేశ్ 106, పశ్చిమ బెంగాల్ 131, కర్ణాటకలో 164 పెండింగ్‌ కేసులున్నాయి.