శివసేనను సోనియా సేనగా మార్చారు

శివసేనను సోనియా సేనగా మార్చారు

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, మహారాష్ట్రలోని అధికార శివ సేనల మధ్య మాటల యుద్ధం  నడుస్తోంది. బుధవారం బాంద్రాలోని పాళీ హిల్ లోని కంగనా బంగ్లాను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూలగొట్టింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంటోంది. 

తాజాగా బీఎంసీతోపాటు శివ సేనపై కంగనా విమర్శలకు దిగింది. శివ సేన పార్టీ సోనియా సేనగా మారిందంటూ దుయ్యబట్టింది. బీఎంసీ అధికారులు గూండాలుగా వ్యవహరించారంటూ మండిపడింది.

‘ఏ భావజాలంతో బాలాసాహెబ్ ఠాక్రే శివ సేనను నిర్మించారో అలాంటి పార్టీ ఇవ్వాళ తన సిద్ధాంతాన్ని అమ్మడానికి సిద్ధమవుతోంది. ఆ పార్టీ శివ సేన నుంచి సోనియా సేనగా మారుతోంది’ అంటూ ఆమె దుయ్యబట్టారు. 

తన వెనుకు నుంచి తన ఇంటిని కూలగొట్టిన అధికారులను సివిక్ బాడీ అని పిలవొద్దని కోరుతూ ఆమె ట్వీట్ చేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సిగ్గులేకుండా పొత్తు పెట్టుకొని శివ సేనను సోనియా సేనగా మార్చారని కంగనా ఎద్దేవా చేసింది. 

శివ సేనతోపాటు, ముఖ్యమంత్రి  ఉద్ధవ్ ఠాక్రే కు కూడా ఆమె చురకలు అంటించారు.  ‘మీ నాన్న వల్ల మీకు ఐశ్వర్యం, సంపద లభించొచ్చు. కానీ గౌరవాన్ని మీరే సొంతంగా సంపాదించాలి. ఎన్ని నోళ్లను మీరు మూయిస్తారు. ఎన్ని గొంతుకలను అణచివేస్తారు. నిజం నుంచి ఎన్నాళ్లు పారిపోతారు?’ అని కంగనా పేర్కొన్నారు. 

అలాగే బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌పై కూడా ట్విటర్‌ వేదికగా ఆమె మండిపడ్డారు. ‘కరణ్‌ జోహర్‌ ముఠా’ చేస్తున్న చట్టవ్యతిరేక చర్యలపై ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలని సూచించారు. ‘ఈ రోజు నా ఇంటిని కూల్చివేశారు. రేపు మీ నివాసం కావచ్చని’ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వాలు శాశ్వతంగా అధికారంలో ఉండవని అన్నారు.

మీరు ఇప్పుడు ఒక గొంతుకను హింసాత్మకంగా అణచివేయడాన్ని ఒక సాధారణ చర్యగా తీసుకుంటే అదే వారి దినచర్యగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఒకరిని కాల్చేసినా.. భవిష్యత్తులో అది వేలాది మందికి మేల్కలుపు అవుతుందని.. ఇప్పటికైనా మేల్కనండి అని ట్వీట్‌ చేశారు.

ఇలా ఉండగా, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహణ్ ముంబై మున్సిపల్ అధికారులు కూల్చివేయించిన చర్యపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కంగన విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని గవర్నర్‌ భగత్‌సింగ్ కొషియారీ తప్పుపట్టారు.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సలహాదారు అజయ్ మెహతాకు ఫోన్‌ చేసిన కొషియారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంగన ఆఫీసు కూల్చివేత, ఇతర పరిణామాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని గవర్నర్ కొషియారీ నిర్ణయించారు. 

మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కంగనా ఆఫీస్ కూల్చివేత చర్యను ఇప్పటికే ఖండించారు. ఇదిలా ఉంటే.. ఆఫీస్ కూల్చివేత అనంతరం కంగనా కూడా శివసేనపై రాజకీయ విమర్శలు పెంచింది.