వ‌చ్చే ఏడాది ఆరంభంలో చంద్ర‌యాన్-3

చ‌ంద్రుడిపైకి చంద్ర‌యాన్-3 మిష‌న్‌ను వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే ప్ర‌యోగించ‌నున్న‌ట్లు భార‌త అంత‌రిక్ష శాఖ‌కు చెందిన స‌హాయ‌మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. చంద్ర‌యాన్-2తో పోలిస్తే చంద్ర‌యాన్‌-3 భిన్నంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు.  చంద్ర‌యాన్‌-3లో ఆర్బిట‌ర్ ఉండ‌ద‌ని చెప్పారు. 
 
 కానీ ఆ ప్రాజెక్టులో ల్యాండ‌ర్‌, రోవ‌ర్ ఉన్నాయ‌ని తెలిపారు. 2021 మొద‌ట్లోనే చంద్ర‌యాన్‌-3ను ప్ర‌యోగించ‌నున్న‌ట్లు చెప్పారు. చంద్ర‌యాన్‌-2ను 2019లో ఇస్రో ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి చంద్ర‌యాన్‌-3ని 2020లో లాంచ్ చేయాల‌నుకున్నారు. 
 
కానీ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆ ప్లాన్ ఆల‌స్య‌మ‌కైంది. లాక్‌డౌన్ వ‌ల్ల చంద్ర‌యాన్‌-3 ప్రాజెక్టు ప‌నులు నిలిచిపోయాయి.  చంద్ర‌యాన్‌-2ను 2019 జూలై 22న ప్ర‌యోగించారు.  సెప్టెంబ‌ర్ 7వ తేదీన విక్ర‌మ్ ల్యాండ‌ర్ చంద్రుడిపై కుప్ప‌కూలింది. కానీ ఆర్బిటార్ మాత్రం డేటాను పంపిస్తూనే ఉన్న‌ది. 
 
అయితే మ‌రోవైపు 2008లో ప్ర‌యోగించిన చంద్ర‌యాన్‌-1 పంపిన ఫోటోలు తాజాగా ఓ కొత్త విష‌యాన్ని తేల్చాయి.  చంద్రుడి ద్రువాలు తుప్పుప‌ట్టిపోతున్న‌ట్లు ఆ ఫోటోలు వెల్ల‌డించాయి. నాసా శాస్త్ర‌వేత్త‌లు దీన్ని ద్రువీక‌రించారు.