బిజెపి, జనసేన రాజకీయాలను శాసిస్తాయి 

రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ, జనసేన కలసి మార్పులు తీసుకొస్తాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ-జనసేన సంయుక్తంగా ముందుకు వెళ్తామని తెలిపారు. “మేము కూడా రాజకీయాలను శాసిస్తాం” అంటూ భరోసా వ్యక్తం చేశారు. 
 
విశాఖ తొలి మున్సిపల్ కార్పోరేషన్ విజయ స్మృతులు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొదటి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లను, అభ్యర్థులను సోము వీర్రాజు సన్మానిస్తూ 2024లో బీజేపీ.. జనసేన పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం వేశారు. 
 
ఈసారి తప్పకుండా విశాఖ కార్పొరేషన్ బీజేపీనే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తూ బీజేపీ ఓట్లు కోసం, సీట్లు కోసం లేదని దేశం కోసం ఉందని తెలిపారు. భారత దేశ చరిత్రలో ఉద్యమ స్ఫూర్తి ఉన్న పార్టీ బీజేపీనేనని చెప్పారు. 
 
1982 ఒక వాహనంపై యాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. ఇందిరాగాంధీ మృతి చెందిన సమయంలో దేశమంతా కాంగ్రెస్ గాలి ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే టీడీపీ గెలిచిందని పేర్కొన్నారు. 
 
ఇప్పుడు రాజకీయాలను డబ్బు  నడుపుతోందని చెబుతూ అలాంటి రాజకీయాలను పాలద్రోలుతామని ప్రకటించారు. రాష్ట్రంలో భూములను రాబందుల్లా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చైనాను గడగడలాడించిందని సోము వీర్రాజు గుర్తు చేశారు.