ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి (74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో ప్రస్తుతం ఆయన గుంటూరులో నివాసం ఉంటున్నారు.
జేపీది సొంతూరు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. 1949, మే 8న ఆయన సిరువెల్ల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే ఆయనకు బాగా ఆసక్తి. దీంతో ఆయన స్వగ్రామం నుంచి గుంటూరుకు వచ్చారు. నల్గొండ జిల్లాలో గప్‌చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా.. ప్రముఖ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావుకు జేపీ నటన నచ్చి సినీరంగానికి పరిచయం చేశారు.
1988లో విడుదలైన బ్రహ్మపుత్రు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 1997లో విడుదలైన ప్రేమించుకుందాం రా సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. అనంతరం సమరసింహారెడ్డి, నరసింహానాయుడు తదితర చిత్రాలతో తన విలనిజంతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. రాయలసీమ యాసలో ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా తనదైన ముద్ర వేశారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన నాటిన నుంచి ఆయన గుంటూరు విద్యానగర్‌లోని నివాసంలోనే ఉంటున్నారు. తెలుగు, తమిళం, కన్నడంలో సుమారు వంద సినిమాలకుపైగా నటించారు. ఆయన చివరిసారిగా మహేశ్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరులో నటించారు.
ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్, నాయక్, బాద్షా, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్, సరైనోడు వంటి హిట్ చిత్రాల్లో నటించిన విలనిజాన్ని ప్రదర్శించడంతో పాటు కామెడీని పండించారు.
More Stories
విశాఖ ఉక్కు కాపాడుకుందాం
22న కృష్ణాతీరంలో 5వేల డ్రోన్ల ప్రదర్శన
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు