టిబెట్ జ‌వాను అంత్య‌క్రియ‌ల్లో రామ్ మాధ‌వ్

టిబెట్ స్పెష‌ల్ ఫ్రాంటైర్ ఫోర్స్‌ (ఎస్ఎఫ్ఎఫ్‌) ద‌ళానికి చెందిన సైనికుడు నిమా టెంజిన్‌కు అంత్య‌క్రియ‌లలో నేడు బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొనడం చైనా వర్గాలకు కలవరం కలిగిస్తున్నది.  గ‌త వారం ల‌డాఖ్‌లో పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న వేళ నిమా టెంజిన్ మందుపాత‌ర‌ పేలుడంతో మృతిచెందాడు.
ఇవాళ ఆ వీర సైనికుడికి తుది సంస్కారాలు చేప‌ట్టారు. లేహ్‌లో ఈ కార్య‌క్ర‌మానికి బీజేపీ నేత రామ్ మాధ‌వ్ హాజ‌ర‌య్యారు. వాస్త‌వానికి  భారత సైన్యం ఆదేశాల ప్ర‌కారం నిమా టెంజిన్ స‌రిహ‌ద్దులో గ‌స్తీ నిర్వ‌హిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ద‌క్షిణ పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద అనుకోకుండా ఓ ల్యాండ్‌మైన్‌పై కాలు వేయ‌డంతో అది పేలింది. ఆ దుర్ఘ‌ట‌న‌లో టిబెట్ జ‌వాను మృత్య‌వాత‌ప‌డ్డాడు.
ఇటీవ‌ల భార‌త్‌, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు స‌మ‌స్య త‌లెత్తిన నేప‌థ్యంలో రామ్ మాధ‌వ్  టిబెట్ సైనికుడి అంత్య‌క్రియ‌ల‌కు వెళ్ల‌డం చ‌ర్చాంశ‌మైంది.  టిబెట్ జ‌వాను అంత్య‌క్రియ‌ల‌కు బీజేపీ నేత హాజ‌రుకావ‌డం చైనాకు స‌వాల్ విసురుతున్న‌ట్లుగా ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.
ఈ సందర్భంగా జరిగిన అంతిమ యాత్రలో స్థానిక ప్రజలు, టిబెటన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత్, టిబెట్ దేశాల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ‘భారత్ మాతా కీ జై, జై టిబెట్‘ అని నినాదాలు చేశారు. అంత్యక్రియల సందర్భంగా  భారత జాతీయ గీతంతోపాటు టిబెట్ జాతీయ గీతాన్ని ఆలపించారు. 
 
భారత్, టిబెట్ ఉమ్మడి శత్రు దేశమైన చైనాపై పోరాడేందుకు సైన్యంలో చేరిన నైమా టెన్జిన్, భారత్ కోసం ప్రాణాలు అర్పించారని స్థానికులు కొనియాడారు. కాగా నైమా పార్థీవదేహంపై భారత్, టిబెటన్ జాతీయ జెండాలను కప్పారు. అనంతరం వీటిని ఆయన భార్యకు ఆర్మీ అధికారులు అందజేశారు.  
1962లో భార‌త్‌, చైనా మ‌ధ్య జ‌రిగిన యుద్ధం త‌ర్వాత టిబెట్ ఎస్ఎఫ్ఎఫ్ ద‌ళాన్ని ఏర్పాటు చేశారు.  ఈ బ‌ల‌గాలు టిబెట్ జాతీయ జెండా క‌లిగి ఉంటాయి. వీరంతా ద‌లైలామా ఆదేశాలు పాటిస్తారు.  హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణులో భార‌త ఆర్మీకి కూడా ఎస్ఎఫ్ఎఫ్ ద‌ళాలు స‌హ‌క‌రిస్తూ ఉంటాయి. ఎస్ఎఫ్ఎఫ్ బ‌ల‌గాల్లో సుమారు 3500 మంది జ‌వాన్లు ఉండి ఉంటార‌ని భావిస్తున్నారు.
రెండు రోజుల క్రిత‌మే చైనా ర‌క్ష‌ణ మంత్రి ఫెండీతో భారత రక్షణ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ మాస్కోలో భేటీ అయ్యారు.  ఆ త‌ర్వాత రాజ్‌నాథ్ ట్వీట్ చేస్తూ రెండు దేశాలు చ‌ర్చ‌లు కొన‌సాగించాల‌ని,  దౌత్య‌, సైనిక ప‌ద్ధ‌తిలో చ‌ర్చ‌లు సాగాలని సూచించారు. శాంతిస్థాప‌న కోసం ద‌ళాల‌ను పూర్తిగా ఉప‌సంహ‌రించాల‌ని కూడా త‌న ట్వీట్‌లో రాజ్‌నాథ్ చైనాకు స్పష్టం చేశారు.