
అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన నూతన విద్యావిధానంలో ప్రభుత్వాల జోక్యం తక్కువగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) పై అన్ని రాష్ట్రాల గవర్నర్లు, విద్యాశాఖ మంత్రులు, వైస్‌ఛాన్సలర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రసంగించారు.
‘దేశ ఆకాంక్షలను నెరవేర్చడానికి ముఖ్యమైన ఆయుధం విద్య. గత కొన్ని సంవత్సరాలుగా మన విద్యా విధానంలో గొప్ప మార్పులేవీ చోటు చేసుకోలేదు. దాంతో దేశంలో ఆసక్తి, సృజనాత్మకతల స్థానంలో మూక మనస్తత్వం అభివృద్ధి చెందింది. కానీ ఎన్‌ఈపీ విధానంలో అధ్యయనం చేయడానికి బదులు నేర్చుకోవడం, అభిరుచి, ప్రాక్టికాలిటీ అనే అంశాలుంటాయి’ అని ప్రధాని పేర్కొన్నారు.
పాఠ్యాంశాల కంటే విమర్శనాత్మక ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. 21వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎప్పట్నుంచో ఉండే సమస్యలను పరిష్కరించి భారత్ మరో “జ్ఞాన ఆర్థిక వ్యవస్థ” గా మారడానికి ఈ కొత్త విద్యావిధానం ఎంతో సహాయపడుతుందని మోదీ వివరించారు.
ఎలాంటి గజిబిజి లేకుండా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా విద్యను బోధించాలని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి యూనివర్శిటీ, కాలేజీకి దశలవారీగా స్వయంప్రతిపత్తి కల్పిస్తామని మోదీ ప్రకటించారు. అంతేకాకుండా ఉత్తమ విద్యాసంస్థలకు రివార్డులు సైతం అందజేస్తామని వివరించారు. ఎన్‌ఈపీతో కొత్త ఆరోగ్యకర చర్చకు తెర లేచిందని, తద్వారా విద్యా విధానం మరింత మెరుగవుతుందని తెలిపారు.
నాలెడ్జ్ ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కొత్త విద్యావిధానం దోహదపడుతుందని ప్రధాని తెలిపారు. బ్రెయిన్ డ్రెయిన్ వలసలను ఎదుర్కోవాలంటే, సాధారణ ప్రజల స్వప్నాలు నిజం కావాలంటే, భారత్‌లో ప్రపంచ మేటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మేటి విద్యా సంస్థలను నెలకొల్పితే.. విద్యార్థులు విదేశాలకు వెళ్లరు అని, మన వర్సిటీల్లోనూ పోటీతత్వం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కొత్త విద్యా విధానం యువతలో జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నింపుతుందన్నారు. భవిష్యత్తు తరాలకు అవసరమైన రీతిలో వారిని తీర్చిదిద్దుతుందని తెలిపారు. గ్రామాలు, నగరాలకు చెందిన లక్షలాది మంది కొత్త విద్యావిధానంపై తమ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లు చెప్పారు.
ఎన్‌ఈపీని విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ నూతన విద్యావిధానం–2020 (ఎన్‌ఈపీ–2020) కేంద్రం ఆమోదించిన సంగతి తెలిసిందే. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టారు.
More Stories
మరోసారి రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం.. అందుకే సీబీఐ విచారణ
మార్గదర్శి ఎండి శైలజను ప్రశ్నించిన ఏపీ సిఐడి