అంకుర సంస్థలకు రూ.50 కోట్ల మేరకు రుణ వసతి 

ప్రాధాన్య రంగంలో రుణాలను పొందే విభాగాల జాబితాను రిజర్వు బ్యాంకు మరింత విస్తరించింది. అంకుర సంస్థలను ఈ జాబితాలో చేర్చి వాటికి రూ.50 కోట్ల మేరకు రుణ వసతి కల్పించింది. అంతేకాకుండా సౌర విద్యుత్‌, కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటు నిమిత్తం రైతులకు కూడా రుణాలను ఇప్పించనున్నది. 
 
ప్రాధాన్య రంగ రుణ (పీఎస్‌ఎల్‌) మార్గదర్శకాలపై సంబంధిత భాగస్వాములందరితో చర్చించి విస్తృత సమీక్ష నిర్వహించామని, సమ్మిళిత అభివృద్ధిపై మరింత దృష్టి సారించడంతోపాటు మారుతున్న జాతీయ ప్రాధమ్యాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను సవరించామని ఆర్బీఐ వెల్లడించింది. 
 
ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద చేపట్టే ప్రాజెక్టులతోపాటు పునర్వినియోగ ఇంధన, ఆరోగ్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేసినట్టు తెలిపింది. 
 
అప్పులు సరిగా లభించక ఇబ్బందిపడుతున్న రంగాలకు మెరుగైన రుణ వసతి కల్పించేందుకు, చిన్న, సన్నకారు రైతులు, బలహీన వర్గాలతోపాటు పునర్వినియోగ ఇంధనం, ఆరోగ్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు రుణ లభ్యతను పెంచేందుకు కొత్త మార్గదర్శకాలు వీలుకల్పిస్తాయని వివరించింది. 
 
అంతేకాకుండా ప్రాధాన్య రుణాల వితరణలో ప్రాంతీయ అసమానతలకు తెర దించేందుకు ఇవి దోహదం చేస్తాయని పేర్కొన్నది. రుణాల లభ్యత తక్కువగా ఉన్న జిల్లాలకు ఈ మార్గదర్శకాల్లో అధిక వెయిటేజీ ఇచ్చినట్టు తెలిపింది. 
 
వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘా (ఎఫ్‌పీవో)లు/వ్యవసాయ ఉత్పత్తిదారుల కంపెనీ (ఎఫ్‌పీసీ)లకు అందజేసే రుణాల పరిమితిని మరింత పెంపొందించామని ఆర్బీఐ పేర్కొంటూ.. చిన్న, సన్నకారు రైతులకు అందజేసే రుణాల లక్ష్యాలను దశలవారీగా పెంచుతామని స్పష్టం చేసింది.