రుణ పునర్‌ వ్యవస్థీకరణ స్కీంలను ప్రకటించండి 

రుణ పునర్‌ వ్యవస్థీకరణ స్కీంలను ప్రకటించండి 

కరోనా కారణంగా ఒత్తిడిలో ఉన్న కంపెనీలకు సంబంధించిన రుణ పునర్‌ వ్యవస్థీకరణ స్కీంలను ఈ నెల 15 లోగా ప్రకటించాలని బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు.

మారటోరియం గడువు ముగిసిన నేపథ్యంలో రుణ గ్రహితలకు ఆర్థిక ప్రయోజనం కల్పించే ఉద్దేశంలో భాగంగా చర్యలను వేగవంతం చేయాలని బ్యాంకర్లు, ఎన్‌బీఎఫ్‌సీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని సూచించారు.

వెంటనే బ్యాంకులు రుణాల పునర్‌ వ్యవస్థీకరణకోసం ప్రకటించే పాలసీలను రూపొందించి అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని ఆమె స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రిజర్వుబ్యాంక్‌ ప్రకటించిన మారటోరియం ఆగస్టు 31తో ముగిసిన విషయం తెలిసిందే.

దీంతో రంగంలోకి దిగిన కేంద్రం రుణాల పునర్‌ వ్యవస్థీకరణపై మూడు గంటలపాటు సాగిన సమావేశంలో అర్హత కలిగిన రుణ గ్రహితలను గుర్తించాలని, వీరికి ఆమోదయోగ్యమైన ప్రణాళికను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.

అలాగే ఈ ప్రణాళికలను ఆయా సంస్థల వెబ్‌సైట్లలో హిందీ, ఇంగ్లిష్‌, ప్రాంతీయ భాషల్లో అప్‌లోడ్‌ చేయాలని ఆమె సలహా ఇచ్చారు. అలాగే ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాలు, శాఖల్లో కూడా ప్రచురించాలని సూచించారు.

గత నెలలో నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరని కార్పొరేట్‌, రిటైల్‌ రుణాలను ఒకేసారి పునర్‌ వ్యవస్థీకరించుకునే అవకాశం కల్పించింది రిజర్వు బ్యాంక్‌. మరోవైపు డెబిట్‌ సర్వీస్‌ కవరేజ్‌ రేషియో, డెబిట్‌-ఈక్విటీ రేషియోపై కేవీ కామత్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నది.

ఇలా ఉండగా,  దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన బ్యాంకింగ్‌ రంగాన్ని కుదేలు చేసే ఏ నిర్ణయం కేంద్రం తీసుకోబోదని, ముఖ్యంగా మారటోరియం తీసుకున్న వారి రుణాలపై విధించే వడ్డీని మాఫీ చేసే ఉద్దేశమేదీ తమకు లేదని  సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు.

కానీ, చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. తదుపరి ఆర్డర్‌ ఇచ్చేంత వరకు గత నెల చివరి వరకు ఉన్న రుణాలను మొండి బకాయిలుగా గుర్తించవద్దని బ్యాంకులకు సుప్రీంకోర్టు సూచించింది.