ఈ కేసులన్నీ సోనియా బృందం కుట్ర 

తనపై పెద్ద కుట్ర జరుగుతోందని రిపబ్లికన్ టీవీ ప్రధాన సంపాదకులు అర్నాబ్ గోస్వామి ఆరోపించారు. తనపై పెట్టిన ప్రతి కేసు బూటకం, కట్టుకథలు అల్లి తనపై కేసులు పెట్టారని విమర్శించారు.  తనకు వ్యతిరేకంగా ఈ కేసులన్నింటిని కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ బృందం, రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు కావాలనే పెట్టారని ఆయన ఆరోపించారు.

ముంబై పోలీసులు ఆయనను బుధవారం కేసులకు సంబంధించి విచారించారు. తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై తప్పుడు కేసులుపెట్టి వేధిస్తున్నారని  ఆయన ముంబైలోని ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీసుస్టేషన్ లోపలికి వెళ్లే ముందు చెప్పారు. 

పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి జర్నలిజం గురించి చెప్పమన్నట్లుగా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. నిజం తన వైపు ఉందని, ఇప్పుడు తనపై రాజకీయవేధింపు పర్వం సాగుతోందని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష అని తేల్చిచెప్పారు. 

పాల్గార్ ఊచకోత ఘటనకు సంబంధించి నిర్వహించిన టీవీ షోలో ఈ ఎడిటర్ ఇన్ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారని ఓ కేసు దాఖలు అయింది. ఇది ఆయనపై తొలి కేసు. దీనిని ఈ ఏడాది ఎప్రిల్ 29వ తేదీన పెట్టారు.

ఇక రెండో కేసులో ఆయన కరోనా కోడ్ ఉల్లంఘించారని అభియోగాలు ఉన్నాయి. ముంబైలో తీవ్రస్థాయిలో లాక్‌డౌన్ దశలో ఆయన బంద్రా రైల్వే టర్మినస్ వెలుపల భారీ సంఖ్యలో వలస కూలీలను గుమికూడేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై ఐపిసి పరిధిలోని 120 బి, 153 ఇతర సెక్షన్ల అనుగుణంగా అభియోగాలు నమోదు అయ్యాయి. 

ఇందులో 120 బి అత్యంత తీవ్రస్థాయికి చెందుతుంది. ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడినట్లుగా దీని పరిధిలో విచారణకు వీలేర్పడింది. ఇక సెక్షన్ 153 పరిధిలో ఆయన దొమ్మిలు లేదా ఘర్షణలకు జనాలను రెచ్చగొట్టేలా వ్యవహరించారనే విచారణకు వీలేర్పడింది. 

మరో సెక్షన్ 153 ఎ పరిధిలో ఆయన మతం, కులం తెగలు, జన్మస్థలాలు, నివాసాలు, భాషల ప్రాతిపదికన పలు వర్గాల మధ్య విద్వేషాలను రగిలించారనే అభియోగం ఉంది.

సమాజంలో శాంతి సామరస్యాల విచ్ఛిన్నతకు కుట్ర పన్నినట్లు కేసులు ఉండటం, అందులోనూ ప్రఖ్యాత న్యూస్ ఛానల్ ఎడిటర్‌పై ఇంటరాగేషన్ జరగడం దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. 40 రోజుల వ్యవధిలో ఆయనను రెండు సార్లు స్థానిక పోలీసులు ఠాణాలో విచారించారు. 

ఇక్కడి పోలీసు స్టేషన్‌కు తీసుకవచ్చిన తరువాత ఆయనను దాదాపు రెండు గంటల పాటు పోలీసులు తమదైన రీతిలో ఇంటరాగేట్ చేసినట్లు వెల్లడైంది. అంతకు ముందు తనను దాదాపు 12 గంటల పాటు విచారించారని అర్నాబ్ తెలిపారు. రిపబ్లిక్ టీవీ సిఎఫ్‌ఒ ఎస్ సుందరంను కూడా ప్రశ్నించినట్లు తెలిపారు.

బాంద్రా కేసుకు సంబంధించి కుట్రను అన్ని విధాలుగా నిర్థారించినట్లు తెలిపారు. బాంద్రాలో కుట్ర జరిగిందని, దీనిని తాము సకాలంలో వెలుగులోకి తేవడం, నిజాలు ముందుంచడం పాపంఅయిందని, ఇది మహారాష్ట్ర పోలీసులు తమకు ఇచ్చిన నజరానా అని అర్నాబ్‌ఆవేదన వ్యక్తం చేశారు.