రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే  

రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించబోమని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ మీటర్లు బిగించి, వ్యవసాయ విద్యుత్ కు బిల్లులు వసూలు చేసి, ఆ మొత్తాన్ని సబ్సిడీగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం ద్వారా  ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం కూడా పడదని హామీ ఇచ్చారు. 

అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ గురువారం సమావేశమైంది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఉచిత విద్యుత్‌ పథకం- నగదు బదిలీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్‌ పథకం అమలు కానున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ‘‘కనెక్షన్‌ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు ఖాతా ఉంటుంది. కరెంటు బిల్లు డబ్బు అందులో నేరుగా జమ కానుంది. అదే డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించనున్నారు. దీని వల్ల రైతుపై ఎలాంటి భారం ఉండదు’’ అని స్పష్టం చేశారు.

ఇక కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.