పాక్‌కు వ్య‌తిరేకంగా బ్రిట‌న్, కెనడాలలో నిరసనలు 

పాకిస్థాన్ ప్ర‌భుత్వ తీరును ఖండిస్తూ బ్రిట‌న్, కెన‌డా దేశాల్లో ఆందోళ‌నకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు.  లండ్‌న్‌లో పార్ల‌మెంట్ భ‌వ‌నం ముందు సింధు బలోచ్ ఫోర‌మ్‌కు చెందిన నిర‌స‌న‌కారులు ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ప్ల‌కార్డుల‌తో పాకిస్థాన్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.  

పాక్ అకృత్యాల‌ను అడ్డుకోవాల‌ని నినాదాలు చేశారు.  బ‌లోచిస్తాన్‌కు విముక్తి క‌ల్పించాలంటూ డిమాండ్ చేశారు. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అధికారిక నివాసం ముందు ఫ్రీ బ‌లోచిస్తాన్ మూమెంట్ స‌భ్యులు ధ‌ర్నా చేప‌ట్టారు. అదృశ‌మ్య‌మైన బాధితుల అంత‌ర్జాతీయ దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు.

కెన‌డాలో కూడా పాకిస్థాన్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి.  టొరంటోలో బ‌లోచ్‌, సింధి, ప‌స్తూన్లు ఆందోళ‌న చేప‌ట్టారు. అదృశ్య‌మ‌వుతున్న సంఘ‌ట‌న‌ల‌ను ఆపేవిధంగా పాక్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు.

ఇస్లాం మ‌తంలోకి బ‌ల‌వంత‌పు మార్పుడులు జ‌రుగుతున్నాయ‌ని, వాటిని నివారించాలని వారు కోరాన్నారు.  న్యాయ‌విరుద్ధ‌మైన హ‌త్య‌ల‌ను అడ్డుకోవాల‌ని డిమాండ్ చేశారు. బలోచి ప్రజలపై పాకిస్తాన్ సైనికుల అత్యాచారాలను తీవ్రంగా ఖండించారు. 

అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఇంగ్లాండ్, కెనడా పాకిస్థాన్ కు మద్దతు ఉపసంహరించుకోవాలని వారు కోరారు. వారి మద్దతు మానవత్వంపై పాకిస్థాన్ మరింత క్రూరంగా వ్యవహరించడానికి దారతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వేలాదిమంది అమాయక బలోచి ప్రజలను అరెస్ట్ చేశారని, వారిలో అనేకమంది అదృశ్యమయ్యారని, మరొకొందరు నిర్బంధంలలో మరణించారని ప్రదర్శనకారులు తెలిపారు.