రాష్ట్రాల‌కు జీఎస్టీ బ‌కాయిలు చెల్లిస్తాం

రాష్ట్రాల‌కు జీఎస్టీ బ‌కాయిలు చెల్లిస్తాం

రావాల్సిన‌ జీఎస్టీ బకాయిల‌ను చెల్లించ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా (దేవుడి చ‌ర్య‌వ‌ల్ల‌) జీఎస్టీ సెస్సు వ‌సూళ్ల‌లో భారీ లోటు ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రాల‌కు బ‌కాయిలు చెల్లిస్తామ‌ని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేర‌కు అన్ని రాష్ట్రాల‌కు కేంద్ర స‌ర్కారు లేఖ రాసింది.  రాష్ట్ర‌స్థాయిలో సాధ్య‌మ‌య్యే అప్పుల విష‌యంలో కేంద్ర స్థాయిలో దూరంగా ఉండాలని తాము భావిస్తున్నామ‌ని కేంద్రం ఆ లేఖ‌లో పేర్కొన్న‌ది. 

ఇదిలావుంటే, జీఎస్టీ బ‌కాయిలను పూడ్చుకోవ‌డం కోసం రాష్ట్రాల‌కు ఇటీవ‌ల కేంద్రం ఇచ్చిన రెండు ప్ర‌త్యామ్నాయాల‌పై సందేహాలను నివృత్తి చేయ‌డానికి కేంద్ర ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి, ఎక్స్‌పెండీచ‌ర్ కార్య‌ద‌ర్శి సెప్టెంబ‌ర్ 1న ఆన్‌లైన్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశంలో రాష్ట్రాలు లేవ‌నెత్తే సందేహాలకు వారు స‌మాధానం ఇవ్వ‌నున్నారు. 

జీఎస్టీ పరిహారం చెల్లింపు విష‌య‌మై కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇటీవ‌ల రాష్ట్రాల ముందు రెండు ప్రతిపాదనలు ఉంచారు. వాటిలో మొద‌టిది ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీకి రాష్ట్రాల‌కు రుణం ఇప్పించ‌డం. రెండోది రూ. 2.5 లక్షల కోట్ల నిధిని ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా రాష్ట్రాల‌కు అందుబాటులో ఉంచ‌డం.

కాగా, ఈ ఏడాది జీఎస్టీ సెస్సు వ‌సూళ్ల‌లో భారీ లోటు ఏర్ప‌డింద‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ వెల్ల‌డించింది. ఒక ఆర్థిక ఏడాదిలో రూ.3 ల‌క్ష‌ల కోట్లు వ‌సూలు కావాల్సి ఉండ‌గా ఈ ఏడాది అది రూ.65 వేల కోట్ల‌కు మించే అవ‌కాశం లేద‌ని ఆర్థిక‌శాఖ‌ అంచ‌నా వేసింది. అంటే ఈ ఏడాది దేవుడి చ‌ర్య (క‌రోనా మ‌హ‌మ్మారి) కార‌ణంగా రూ.2.35 ల‌క్ష‌ల కోట్ల లోటును ఏర్ప‌డింద‌ని తెలిపింది.   

ఇలా ఉండగా, జీఎస్‌టీఆర్ -2ఏ లో రెండు కొత్త పట్టికలను చేర్చారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వ‌స్తువుల వివ‌రాలు సెజ్ యూనిట్లు ,సెజ్ డెవలపర్ల నుంచి తయారైన సామాగ్రి వివరాలను తెల‌ప‌డానికి వీలుగా జీఎస్‌టీఆర్ -2ఏ ఫార‌ములో రెండు కొత్త పట్టికలు చేర్చారు. 

పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు వారి బిల్లు ఎంట్రీల వివ‌రాల‌ను ఐసీఈజీఏటీఈ సిస్టమ్ (కస్టమ్స్) నుంచి జీఎస్‌టీ సిస్టమ్ (జీఎస్‌టీఎన్‌) ద్వారా వీక్షించవ‌చ్చు. కార్యాచరణ అనుభూతిని ఇవ్వడానికి పన్ను చెల్లింపుదారుల నుంచి అభిప్రాయాన్ని పొందడానికి వీలుగా ప‌రిశీల‌ణాత్మ‌క‌పు ప్రాతిపదికన ప్రస్తుత డేటా అప్‌లోడ్ చేశారు.