హైదరాబాద్ రక్షణ ఉత్పత్తులకు రూ. 1 లక్ష కోట్ల ఆర్డర్లు

రక్షణ తయారీలో స్వయం సమృద్ధి సాధించాలనే భారతదేశ ప్రణాళికలకు కీలకమైన హైదరాబాద్ రక్షణ, ఏరోస్పేస్ రంగం రాబోయే రెండేండ్లల్లో రూ .1 లక్ష కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందటానికి సిద్ధంగా ఉంది. కేంద్రం ఇప్పటికే 101 ఆయుధాలు, పరికరాల దిగుమతిపై నిషేధం విధించిందని డీఆర్‌డీవో చీఫ్ సతీష్ రెడ్డి  తెలిపారు. 

108 ఆయుధాలను దేశీయంగా అభివౄద్ది చేసుకోవచ్చని డీఆర్‌డీవో ఇటీవలే రక్షణ మంత్రిత్వ శాఖకు ఓ నివేదిక సమర్పించిందని పేర్కొన్నారు. దీంతోపాటు డిఫెన్స్ ఎక్వైజేషన్ కౌన్సిల్ ఇటీవల తీసుకున్న నిర్ణయం కారణంగా తెలంగాణరాష్ట్రంలోని ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లకు ఊతం లభిస్తుందని చెప్పారు. 

“మేక్ ఇన్ తెలంగాణ” పై వర్చువల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ సందర్భంగా ఆయన చెప్పారు. “డిఫెన్స్, ఏరోస్పేస్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం వచ్చే రెండేండ్లలో లక్ష కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకుంటుందనిసతీష్ రెడ్డి తెలిపారు. అభివృద్ధిలో దూసుకెళ్తూ పెట్టుబడుల ఆకర్షణలో ముందజలో ఉన్న హైదరాబాద్ నగరానికి మరో ఇది మరింత ఊతమివ్వనున్నదని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే ఫార్మా, ఐటీ హబ్‌గా ఉన్న భాగ్యనగరం.. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లోనూ పురోగమిస్తున్న సంగతి తెలిసిందే. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల కోసం బీడీఎల్‌కు రూ.25 వేల కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని, మరో రూ.10 వేల కోట్ల ఆర్డర్లపై సంప్రదింపులు జరుగుతున్నాయని డీఆర్‌డీవో చీఫ్ సతీష్ రెడ్డి తెలిపారు. ఇందులో ప్రయివేట్ రంగానికి భాగస్వామ్యం ఉండటం వల్ల హైదరాబాద్‌లోని యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుందని భరోసా వ్యక్తం చేశారు.