అసమ్మతి అంటే కాంగ్రెస్ కు గిట్టదు 

చలసాని నరేంద్ర 

ప్రజాస్వామ్య వికాసానికి సుస్థిరమైన ప్రభుత్వం ఎంత అవసరమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ప్రశ్నించే స్వభావమే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం. ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలో కూడా విధానాల గురించి ప్రశ్నించేవారు లేనిపక్షంలో పరిపాలన గాడి తప్పక తప్పదు. 

అయితే భారత ప్రజాస్వామ్యంలో తొలినుండి ప్రశ్నించే స్వభావాన్ని ఎవ్వరు హర్షించడం లేదు. ప్రశ్నించడాన్ని నాయకత్వ దిక్కారంగా, రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలపడంగా, అసమ్మతిగా భావిస్తూ వస్తున్నారు. చివరకు నేడు రాజద్రోహంగా, దేశద్రోహంగా కూడా పరిగణించే దుస్థితి నెలకొంటుంది.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇటువంటి దుష్ట సంస్కృతిని అలవాటు చేసింది భారత దేశంలో ప్రజాస్వామ్యంపై పునాదిగా భావించే కాంగ్రెస్ పార్టీ, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు అని చెప్పక తప్పదు. అసలు ఆ పార్టీ నాయకులు తాము అధికారం కోసమే ఉన్నామనే అపోహలతో ఉంటూ వచ్చారు. అందుకనే నేడు ప్రతిపక్ష పాత్ర వహించడం వారికి సాధ్యం కావడం లేదు.

జవహర్ లాల్ నెహ్రూ అయితే సన్నిహితుల వద్ద ఈ మాటను నేరుగానే ప్రస్తావిస్తూ ఉండేవారు. “నేను సోషలిస్ట్ ను. అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన పనులు చేస్తున్నాను. ఇంకా దేశంలో ప్రతిపక్షం అవసరం ఎందుకు?” అంటూ ప్రశ్నించేవారు. అటువంటి ధోరణి నుండి కాంగ్రెస్ బయటపడలేక పోతున్నది. 

సుదీర్ఘకాలం భారత రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ నేడు ఒక విధంగా అస్తిత్వ సమస్య ఎదుర్కొంటున్నది. తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాజకీయ మనుగడను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇటువంటి పరిస్థితులలో పార్టీలో నూతన ఉత్సాహం కలిగించడం కోసం, పార్టీకి నూతన జవసత్వాలు కలిగించడం కోసం రాహుల్ గాంధీ గత ఏడాది పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ బలమైన సంకేతాలు ఇచ్చారు. 

ఒక విధంగా అనూహ్యమైన రాజకీయ సంస్కరణలకు కాంగ్రెస్ పార్టీని వేదికగా చేయడం కోసం రాహుల్ ప్రయత్నం చేశారు. పార్టీ యువజన, విద్యార్థి  విభాగాలకు బయటివారి చేత సంస్థాగత ఎన్నికలు జరపడం, నూతన తరాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టారు. 

అదే విధంగా రాజినామా చేస్తూ గాంధీ కుటుంభం నుండి కాకుండా మరొకరిని పార్టీ అధ్యక్షనిగా ఎన్నుకోవాలని సూచించారు. అయితే చివరికి తాత్కాలిక ఏర్పాటుగా సోనియా గాంధీకే నాయకత్వం అప్పగించారు. 

తాజాగా 23 మంది పార్టీ సీనియర్ నేతలు పార్టీలో వ్యవస్థాగత ఏర్పాట్లపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పార్టీ ప్రక్షాళనకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమెకు ఒక లేఖ వ్రాసారు. ఒక విధంగా వారు వ్రాసిన లేఖ పార్టీ ప్రక్షాళనకు సంబంధించి ఒక సువర్ణకాసం. 

అయితే రాహుల్ గాంధీ పదవి లేకుండా సర్వాధికారాలు చెలాయించే ప్రయత్నంలో ఉండడంతో ఆ లేఖ పట్ల తీవ్ర అసహనం ప్రదర్శించారు. ప్రత్యర్థి బిజెపితో కుమ్మక్కయ్యారని అంటూ వారిని తీవ్రంగా దూషించారు. బిజెపి తన పొరపాట్లతో తాను కూలిపోతే తిరిగి అధికారం చేపట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ తమ కుటుంభం గుప్పెట నుండి బయటపడకుండా కాపాడుకొనే ప్రయత్నంలో రాహుల్ ఉన్నట్లు ఇప్పుడు భావించవలసి వస్తున్నది.

 ఆయన ఇప్పటి వరకు చెప్పుకొంటూ వస్తున్న సంస్థాగత సంస్కరణలు అన్ని పార్టీలో సీనియర్ నాయకులను పక్కకు తప్పించి, తన సొంత మద్దతు దారులకు పట్టాభిషేకం చేయడం కోసం వేస్తున్న ఎత్తుగడగా ఇప్పుడు బహిర్గతమైనది. గతంలో ఇందిరా గాంధీ పెత్తనం ప్రభుత్వంలో జరిగేటట్లు చేయడం కోసం అనుసరించిన కామరాజ్ పధకం వంటిదే ఇది. 

రాహుల్ గాంధీ తో సమస్య ఏమిటంటే ఆయన మద్దతు దారులు ఎవరికి పార్టీ పట్ల కట్టుబాటు లేదు. సొంతంగా ప్రజలను ప్రభావితం చేయగల శక్తీ లేదు. క్షేత్ర స్థాయిలో పనిచేసిన అనుభవం లేదు. అధికారం లేకపోతే మనుగడ సాగింపలేరు. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ లు ఆ అంశాన్ని బహిర్గతం చేశారు. 

పైగా నేడు రాహుల్ గాంధీ వద్ద కీలక నిర్ణయాలు తీసుకొంటున్న వారెవ్వరికి కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి అనుబంధం లేదు. పైగా వారంతా వామపక్ష స్వభావం కలిగిన వారు. దానితో వారి విధానాలు పార్టీ అనుసరిస్తున్న `మధ్యేమా మార్గం’కు భిన్నంగా ఉండడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు హర్షింపలేక పోతున్నారు.

 ప్రస్తుతం రాహుల్ నివాసం నుండి పనిచేస్తున్న నలుగురు సహాయకులు కూడా జె ఎన్ యు వారే. వామపక్ష భావాలు గల ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ పార్టీ యువజన, విద్యార్హ్ది విభాగాలును అనధికారికంగా చూస్తున్నారు. అదే విధంగా ఆయనకు అంతర్గత సలహాదారులైన అలంకార సవాయ్, కె రాజు కూడా వామపక్ష భావాలూ గలవారే.

ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలలో ప్రచారంలో ఉన్న జోక్ ఏమిటంటే రాహుల్ ను కలవాలి అంటే సీతారాం ఏచూరి లేదా ప్రశాంత్ భూషణ్ లను కలిస్తే ఎక్కువ ప్రభావం ఉంటుందని. ఎందుకంటె ఆయన పార్టీ నేతలు ఎవ్వరికీ అందుబాటులో లేరు. కేవలం రాహుల్ ను కలసి తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం దొరకక పోవడంతో బిస్వా హిమంతా బిస్వా శర్మ వంటి వారెందరో పార్టీని వదిలి వెళ్లిపోయారు. 

తాము బిజెపితో కుమ్మక్కయ్యామని రాహుల్ అనగానే కపిల్ సిబాల్, గులాబీ నబి ఆజాద్ తీవ్రంగా, బహిరంగంగా, ధిక్కార ధోరణిలో స్పందించడం గమనిస్తే రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేదని స్పష్టమవుతుంది. రాహుల్ ను ధిక్కరించిన వారీ రాష్ట్రాలలో పార్టీ బలోపేతం చేయగలుగుతున్నారు. 

పంజాబ్ లో కెప్టెన్ అమరిందర్ సింగ్, రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ రాహుల్ మద్దతుదారులను కాదని అధికారంలో కొనసాగ గలుగుతున్నారు. మహారాష్ట్రలో సహితం శివసేనతో కలసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాహుల్ కు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే పార్టీ వద్దన్నా తాము విడిపోయి ప్రభుత్వంలో చేరతామని పార్టీ శాసన సభ్యులే స్పష్టం చేయడంతో రాహుల్ కు దిక్కులేక పోయింది. 

యువతకు నాయకత్వం పేరుతో రాహుల్ ప్రోత్సహించిన నాయకులు ఎవ్వరు ఏ రాష్ట్రంలో కూడా పార్టీని పటిష్టం చేయలేక పోయారు. తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడడానికి సహితం రాహుల్ ఎంపిక చేసిన నాయకులే కావడం గుర్తించాలి. 

లేఖలో సంతకం చేసిన 23 మందిలో ఒకరైన జితిన్ ప్రసాదను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ ఉత్తరప్రదేశ్ జిల్లా శాఖ తీర్మానం చేయడంపై కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘కాంగ్రెస్ తన సొంతం కాకుండా సర్జికల్ స్ట్రైక్‌లతో బీజేపీని లక్ష్యంగా చేసుకోవాలి’ అని ఎద్దేవా చేయడం గమనిస్తే పరోక్షంగా ప్రియాంక గాంధీకి చురక అంటించినట్లు స్పష్ట అవుతుంది.

 
గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైనప్పుడు పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమైనది. కానీ ఇప్పుడు ఆయన తిరిగి అధ్యక్ష పదవి చేపట్టాలి అనుకొంటే అటువంటి వాతావరణం కనిపించడం లేదు. అందుకనే పార్టీలో సీనియర్లు అందరు పక్కకు తప్పుకొని తనకు తిరుగులేని అధికారం ఇచ్చే విధంగా చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. 
 
యుపిఎ హయాంలో ఎటువంటి ప్రభుత్వ పదవి లేకుండా ప్రభుత్వాన్ని సోనియా గాంధీ నడిపించిన రీతిలో ఇప్పుడు కూడా పార్టీలో ఎటువంటి పదవి లేకుండా పార్టీ అంతా తన కనుసన్నలలో ఉండేటట్లు చేసుకోవాలని రాహుల్ చూస్తున్నారు. ప్రతిపక్షాల పట్ల అసహనం కూడా నెహ్రు హయం నుండే వస్తున్నది. కేరళలో ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ప్రధానిగా నెహ్రు, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆయన కుమార్తె ఇందిరా కలసి రద్దు చేసి రాష్ట్రపతి పాలన తీసుకు రావడం చూసాం. 
(మన తెలంగాణ నుండి)