భారత దేశాన్ని అస్థిరపరిచేందుకు, ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్ కొత్త కొత్త పన్నాగాలు పన్నుతోంది. పొదలు, గుట్టల మాటు నుంచి ఉగ్రవాదులను పంపిస్తూనే, ఏకంగా భారత భూభాగంలోకి సొరంగాన్నే తవ్వింది.
భారత దేశం-పాకిస్థాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు కంచె క్రింద సొరంగాన్ని గుర్తించినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికారులు శనివారం తెలిపారు. వెంటనే అప్రమత్తమై ఈ ప్రాంతంలో ఇంకా ఇటువంటి నిర్మాణాలు ఉన్నాయేమో చూడటానికి గాలింపు జరుపుతున్నామని చెప్పారు.
బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్థానా కూడా దీనిపై స్పందించారని, చొరబాట్ల నిరోధక గ్రిడ్ సురక్షితంగా ఉన్నట్లు నిర్థారించుకోవాలని ఫ్రాంటియర్ కమాండర్లను ఆదేశించారని చెప్పారు. సరిహద్దుల వెంబడి ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.
జమ్మూలోని సాంబ సెక్టర్‌లో ఈ సొరంగాన్ని గురువారం గుర్తించినట్లు తెలిపారు. భారత భూభాగంలో ఈ సొరంగం పొడవు 50 మీటర్లు కాగా, దీని లోతు 25 అడుగులు ఉందన్నారు. దీనిని పరిశీలించినపుడు ప్లాస్టిక్ సంచుల్లో ఇసుక నింపిన బస్తాలు కనిపించాయని, ఈ ప్లాస్టిక్ సంచులపై పాకిస్థానీ గుర్తులు ఉన్నాయని వివరించారు. ఈ సొరంగం నుంచి దాదాపు 400 మీటర్ల దూరంలో పాకిస్థానీ సరిహద్దు గస్తీ స్థావరం ఉందని తెలిపారు.
భారత్-పాక్ మధ్య సరిహద్దు పొడవు 3,300 కిలోమీటర్లు కాగా, ఇది జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల వెంబడి ఉంది. ఉగ్రవాదులు చొరబడటంపై నిఘా హెచ్చరికల నేపథ్యంలో ఈ సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.
More Stories
కెనడాలో హిందూ ఆలయంపై దాడి పిరికిపంద చర్య
కాంగ్రెస్, ఆర్జేడీలు గిరిజన వ్యతిరేకులు
మహారాష్ట్ర డీజీపీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు