హైదరాబాద్ లో శిధిలావస్థలో సర్కార్ స్కూల్స్ 

హైదరాబాద్ లో శిధిలావస్థలో సర్కార్ స్కూల్స్ 

హైదరాబాద్ నగరంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా, కనీస మరమ్మతులు కూడా లేకపోవడంతో సర్కారు స్కూల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకే రోజు రెండో పాఠశాలల భవనాలు కుప్పకూలి పడడం సమస్య తీవ్రతను వెల్లడి చేస్తున్నది. ప్రతి వానాకాలం ఏదో ఒకచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. 

సుల్తాన్ బజార్ లో 1866లో నిర్మించిన గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ పైకప్పు గురువారం ఉదయం కూలింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 57 ఏండ్ల కిందట నిర్మించిన ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ పైకప్పు కూడా అదే రోజు నేలమట్టం అయింది.  లాక్ డౌన్ తో పిల్లలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

సుల్తాన్ బజార్ స్కూల్ లో వంద మందికి పైగా, కంటోన్మెంట్ బోర్డులోని ప్రైమరీ స్కూల్ లో దాదాపు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 

సుల్తాన్ బజార్ లోని ప్రభుత్వ పాఠశాల భవనం 12 ఏండ్ల కిందటే శిథిలావస్థకు చేరింది. 2008లో కొంత భాగం కూలిపోయింది. 2009, 2010, 2013లో పైకప్పు కొంత కిందపడడంతో కూలిన ప్రాంతంలో వదిలి, మిగతా గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. స్కూల్స్ నడిచే రోజుల్లో విద్యార్థులు కూలిన బిల్డింగ్ ఏరియా కింది నుంచే టాయిలెట్ కు వెళ్తుంటారు.

గ్రేటర్ హైదరాబాద్ లో 182 హైస్కూల్స్, 8 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ , 600 దాకా ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో 124 స్కూళ్లు ప్రైవేట్ బిల్డింగ్స్ లోనే కొనసాగుతున్నాయి. మిగతా వాటికి పక్కా భవనాలున్నా, 40 దాకా శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్ని ఆలయాల్లో నిర్వహిస్తున్నారు. 

చాలా స్కూల్లకు విద్యుత్ సదుపాయం లేదు. ప్రహరీల్లేవు. ప్రతి వానాకాలం ఏదో ఒక బిల్డింగ్ కూలుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కనీసం మరమ్మతులు కూడా చేయించడం లేదు. 40 దాకా స్కూళ్లు శిథిల భవనాల్లో నడుస్తున్నాయి.