బీహార్‌ ఎన్నిక‌లు వాయిదా వేయ‌‌లేం

క‌రోనా వైర‌స్ కార‌ణం చేత బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఆప‌లేమ‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది.  ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేసే విధంగా ఎన్నిక‌ల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీం స్పందించింది. కోవిడ్ నెపంతో ఎన్నిక‌ల‌ను ఆప‌లేమ‌ని, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అధికారాల‌ను ప్ర‌శ్నించ‌లేమ‌ని సుప్రీం  స్పష్టం చేసింది.  

పిటిషన్‌పై విచారణ జరిపేందుకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల వాయిదా గురించి భారత ఎన్నికల సంఘం (ఈసీ)ని సంప్రదించాలని సలహా ఇచ్చింది. కోవిడ్ అనేది ఎన్నికల వాయిదాకు సరైన కారణం కాబోదని వివరించింది.

బీహార్ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇంత వ‌ర‌కు నోటిఫికేష‌న్ కూడా రాలేద‌న్న‌ది. సీఈసీకి తామేమీ ఆదేశాలు ఇవ్వ‌లేమ‌ని, క‌మిష‌న‌ర్ అన్నీ ప‌రిగ‌ణలోకి తీసుకుంటార‌ని కోర్టు చెప్పింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ కాలేద‌ని, అందుకే పిటిష‌న్‌కు అర్హ‌త లేద‌ని,  ఎన్నిక‌లు నిర్వ‌హించ‌వ‌ద్దు అని ఈసీని ఎలా ఆదేశిస్తామ‌ని కోర్టు ప్రశ్నించింది. 
 
ఎన్నిక‌ల వాయిదాకు కోవిడ్ అనేది స‌రైన కార‌ణం కాదు అని పేర్కొన్న‌ది. న‌వంబ‌ర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  బిహార్‌ను కోవిడ్-19, వరదల రహిత రాష్ట్రంగా ప్రకటించే వరకు ఎన్నికలను నిర్వహించరాదని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఆదేశాలు ఇవ్వాలని  అవినాశ్ థాకూర్ సుప్రీంలో పిటిష‌న్ వేశారు.   
 

ఇదిలావుండగా, కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే బిహార్ శాసన సభ, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమైంది. ఈ ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉందన్న ఊహాగానాలకు తెర దించుతూ, కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా సజావుగా నిర్వహించేందుకు కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. 

బిహార్ ఎన్నికలను వాయిదా వేయాలని లోక్ జన శక్తి పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే కోరుతున్నాయి. బిహార్ శాసన సభ ఎన్నికలు అక్టోబరు, నవంబరు నెలల్లో జరిగే అవకాశం ఉంది.