షార్ లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ పనులు తిరిగి ప్రారంభం 

ప్రతిష్టాత్మక స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన కార్యకలాపాలను చేపట్టేందుకు శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పనులను మళ్లీ ప్రారంభించనుంది. సాలిడ్ ప్రొపెల్లెంట్ ప్లాంట్ (ఎస్‌పీపీ), సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ బూస్టర్ ప్లాంట్ (ఎస్‌పీఆర్‌ఓబీ) మూసివేయబడిన పది రోజుల తర్వాత బుధవారం నుంచి పరిమిత సంఖ్యలో సిబ్బందితో ప్రారంభమయ్యాయి.

చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో అభివృద్ధి చేసిన పీఎస్ఎల్‌వీకి ప్రతిరూపమైన ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ఈ ఏడాది ప్రయోగించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఇస్రో కార్యకలాపాలను నిలిపివేసింది. సంస్థ రెగ్యులర్ కార్యకలాపాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఇస్రో చైర్మన్‌ కే శివన్ అంగీకరించారు.

అయితే, ఈ ఏడాది చివరినాటికి కనీసం రెండు లాంచీలు జరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ కాస్టింగ్‌ను సెప్టెంబర్ 4న ప్లాన్ చేశామని, ప్రీమిక్సింగ్ ఆపరేషన్ ఆగస్టు 27 నుంచి ప్రారంభమవుతుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా షార్‌ కంట్రోలర్‌ కుంభకర్ణన్‌ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ కొవిడ్‌ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని నిబంధనల మేరకు ఎస్‌పీపీ, ఎస్‌పీఆర్‌ఓబీ పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. బుధవారం నుంచి తదుపరి ఆదేశాల వరకు ఎస్‌పీపీ, ఎప్‌పీఆర్‌ఓబీ ఇతర సంస్థల్లోని సిబ్బందిని రోస్టర్‌ విధానంలో తీసుకుంటున్నామని చెప్పారు.

అలాగే అత్యవసర సేవలు కాకుండా ఇతర ఉద్యోగులు  ఇంటి నుంచి పని చేస్తున్నారని, అందరు టెలిఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మార్గాల్లో అన్ని సమయాల్లో అందుబాటులో ఆదేశాలిచ్చినట్లు వెల్లడించాయిరు. జారీ చేసిన కొత్త పని విధానాల ప్రకారం అవసరానికి అనుగుణంగా విధులకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.

అలాగే కరోనా వ్యాప్తిని నివారించడానికి షార్‌, సూల్లూరుపేటలోని హౌసింగ్‌ కాలనీల వాసులందరు తమ ఇండ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే సరైన పత్రాలు సమర్పించి, బయటకు వెళ్లాలని సూచించారు. ఈ మేరకు కాలనీ సంక్షేమ క్లబ్‌లకు ఆదేశాలు అందించినట్లు పేర్కొన్నారు.