పోలీస్ వ్యవస్ధలో ప్రక్షాళన జ‌ర‌గాలి 

పోలీస్ వ్యవస్ధలో ప్రక్షాళన జ‌ర‌గాల‌ని, స‌మ‌స్య‌ల‌తో పోలీసు స్టేషనుకు వ‌చ్చే ప్రజలను గౌరవించాల‌ని ఏపీ డీజీపీ గౌత‌మ్ సవాంగ్ హితవు చెప్పారు. ప్రజలు గౌరవించేలా, నేరస్థులు భయపడేలా పోలీసుల పనితీరు ఉండాలని సూచించారు.  పోలీసు‌ శాఖలోని అన్ని అంతర్గత డిపార్ట్మెంట్లతో డీజీపీ బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 76 వేల మంది పోలీసు సిబ్బందితో నిర్వ‌హించిన ఈ కాన్ఫ‌రెన్స్‌లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై  దిశా నిర్దేశం చేశారు. 
 
ఇటీవల జరిగిన శిరోముండనం సంఘటనతో మొత్తం పోలీసులందరికీ ప్రవర్తన నియమావళిపై పలు సూచనలు చేశారు. పోలీసు స్టేషన్లకు వస్తున్న బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలి, అలాగే బాధితులతో పోలీసుల వ్యవహారశైలి ఎలా ఉండాలి అన్న దానిపై డీజీపీ దిశానిర్దేశం చేశారు  
కోవిడ్ సమయంలో పోలీసుల సర్వీసులో చాలా మంచి పేరు తెచ్చుకున్నామ‌ని , పోలీసుల సేవలు అభినందనీయ‌మ‌ని కొనియాడారు. అయితే అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసుల వ‌ల్ల కొందరు సామాన్యులు ఇబ్బంది పడ్డార‌ని విచారం వ్యక్తం చేశారు. దీని కార‌ణంగా ఒక పోలీసు తప్పు చేస్తే పోలీస్ వ్యవస్ధ మొత్తాన్ని ప్ర‌జ‌లు తప్పు ప‌ట్టే ప్ర‌మాదం ఉందని హెచ్చరించారు.
సామాన్యుల ప‌ట్ల ప్ర‌వ‌ర్తించిన కొంద‌రు పోలీసుల‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని, నేరం చేసిన వారు ఎవ‌రైనా స‌రే క‌చ్చితంగా న్యాయ పరమైన చర్యలు తీసుకుంటుంద‌ని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది మీద పోలీసులే చర్యలు తీసుకోవడం చాలా బాధాకరమైనా తప్పదని చెప్పారు. ఆత్మ‌ విమర్శ చేసుకోవడం చాలా అవసరమ‌ని, మార్పు కోసం చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు.
“మనం అందరం కలిసి మార్పు కోసం ప్ర‌య‌త్నిద్దాం.  ప్రభుత్వం, ప్రజలు మనకు బాధ్యత అప్పజెప్పారని టీం అందరికీ అర్ధమౌతుందని అనుకుంటాను. పోలీసు సిబ్బంది మొత్తం రాబోయే రెండు నెలలు ఓరియంటేషన్ క్లాసులకు హాజరు కావాలి. మార్పులు ప్రతీ పోలీసు స్టేషన్లో కనిపించాలి”  అని హితవు చెప్పారు.
పోలీసు స్టేషనుకు వచ్చిన వారిని మంచిగా రిసీవ్ చేసుకొవాలని అంటూ సామాన్య ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండాలని గౌత‌మ్ సవాంగ్ స్పష్టం చేశారు.