పాఠశాలలు తెరిచినా పిల్లలను పంపం  

పాఠశాలలు తెరిచినా పిల్లలను పంపం  
సెప్టెంబర్ 1న ప్రభుత్వం పాఠశాలలు తెరిస్తే 62 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలను తిరిగి పాఠశాలకు పంపించమని స్పష్టం చేసినట్లు ఓ సర్వే తెలిపింది. మల్లీఫెక్స్‌లు, ధీయేటర్లు తెరిచినా రాబోయే 60 రోజుల వరకు కేవలం 6శాతం మంది మాత్రమే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. 
 
మెట్రో, లోకల్ రైళ్లను పునఃప్రారంభిస్తే కేవలం 36శాతం మంది మాత్రమే వాటిని వినియోగిస్తామని చెప్పారు.  మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లు, మెట్రో, లోకల్ రైళ్లు, పాఠశాలలు తెరవడం గురించి పౌరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. 
 
ఈ సర్వేలో భారతదేశంలోని 261 జిల్లాల్లో నివసిస్తున్న పౌరుల నుంచి 25 వేలకు పైగా స్పందనలు వచ్చాయి. భారతదేశంలో ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 70 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. ముఖ్య పట్టణాల్లో ప్రతిరోజు సుమారు 1000 కేసులు నమోదవుతుండగా జిల్లాల్లో సుమారుగా 400కు పైగా కేసులు నమోదవుతూ వేగంగా పట్టణాలు, గ్రామాలకు వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. 
 
సీనియర్ తరగతుల కోసం పాఠశాలలను తిరిగి ప్రారంభించాలా వద్దా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నందున, లోకల్ సర్కిల్స్ సర్వే ప్రతినిధులు ఇదే విషయమై తల్లిదండ్రులను అడిగారు.
 
సెప్టెంబర్1 నుంచి సీనియర్ తరగతులకు, తరువాత మిగతా తరగతులకు పాఠశాలలు ప్రారంభిస్తే తమ పిల్లలు, మనవరాళ్లను పాఠశాలకు పంపుతారా? అని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రశ్నించగా.. 62 శాతం మంది పంపమని చెప్పగా.. 23 శాతం మంది పంపుతాం అని సమాధానం ఇచ్చారు. 15 శాతం మంది ఇంకా ఆలోచించలేదని చెప్పారు. 
 
దీన్నిబట్టి చూస్తే పాఠశాలలు తెరిచినా పిల్లలను పంపే యోచనలో తల్లిదండ్రులు లేరని స్పష్టమైంది. అమెరికా సహా పలు దేశాల్లో పాఠశాలలు పునఃప్రారంభించిన 2 వారాల్లో 97,000 మంది కరోనా బారిన పడ్డారు. జర్మనీలోని బెర్లిన్‌లో కూడా 41 పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైరస్‌ సోకింది. 
 
డిసెంబరు 31 వరకు పాఠశాలలను సాధారణ రీతిలో తెరవడాన్ని కూడా భారత్ పరిగణించకూడదని చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ విద్య, టెలివిజన్, రేడియో ఆధారిత తరగతులు కొనసాగించాలని తల్లిదండ్రులు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. 
 
సెప్టెంబర్ 1 నుంచి మెట్రో, లోకల్ రైళ్లను పునఃప్రారంభిస్తే రాబోయే 60 రోజుల్లో వాటిని వినియోగిస్తారా అన్న ప్రశ్నకు 36 శాతం మంది ‘అవును’ అని.. 51 శాతం మంది ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు. మిగిలిన 13 శాతం మందికి దీని గురించి తెలియదు. 
 
మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లను తెరిస్తే రాబోయే 60 రోజుల్లో సినిమాలు చూడటానికి వెళ్తారా అని సర్వే అడిగిన ప్రశ్నకు 3శాతం మంది చాలాసార్లు వెళ్తామని, 3శాతం మంది ఒకటి, రెండుసార్లు వెళ్తామని చెప్పారు. 77 శాతం మంది తమను తాము సురక్షితంగా ఉంచడానికి సినిమా హాళ్లకు వెళ్లమని స్పష్టం చేశారు. 14 శాతం మంది సినిమాలు చూడటానికి సినిమా థియేటర్లకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.