గణేష్ ఉత్సవాలపై వేధింపులకు రేపు నిరసన 

గణేష్ ఉత్సవాల పట్ల కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వేధింపులు, విధిస్తున్న ఆంక్షలకు నిరసనగా సోమవారం తెలంగాణ అంతటా నిరసన జరపాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.  విశ్వహిందూ పరిషత్ – తెలంగాణ శాఖలు పిలుపిచ్చాయి. 
 
వినాయక చవితి మండపాల విషయములో ఏలాంటి ఆంక్షలు ఉండవని మొదట్లో ప్రభుత్వం పోలీసులు ప్రకటించారని, కానీ మాట మార్చిన ప్రభుత్వం భక్తులు, కార్యకర్తలు,  అన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత మళ్లీ గొంతు మార్చి ఇంటిలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించాలని  ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జిల్లా పోలీసు అధికారులు ప్రతి చోట ఉత్సవాల నిర్వాహకులను, మంటపదారులను, వేధింపులకు గురి చేస్తూ పలు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. పలుచోట్ల ఉత్సవ నిర్వాహకులు, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసారని దుయ్యబట్టారు. 

దీనికి నిరసనగా సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లో బస్తీల్లో, గల్లీ గల్లీ లో  మూతికి నల్ల వస్త్రం  కట్టుకొని, లేదా నల్ల బట్టలు వేసుకొని, నల్ల రిబ్బన్ లు భుజానికి కట్టుకొని,  నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

వినాయక మండపం పెట్టాలి అనుకున్న వారు, వారి మండపం పెట్టే స్థలంలో కాని, ఆ వీధిలో కాని, ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. హిందూ బంధువులు అందరూ కార్యకర్తలు, మంటపాల నిర్వాకులు కార్యక్రమములో  పాల్గొనాలని కోరారు. హైకోర్ట్ అనుమతి ఇచ్చిన అనుమతి పత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు.