రోహిత్ శర్మకు రాజీవ్ ఖేల్ రత్న

క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న  అవార్డుకు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. రోహిత్‌తోపాటు రెజ్లర్ వినేశ్ ఫొగట్, టిటి స్టార్ మనికా బత్రా, రియో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు పేర్లను క్రీడా శాఖ ప్రతిపాదించింది.
 
క్రికెట్‌లో రోహిత్ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ చరిత్ర సృష్టించారు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా నిలిచే రోహిత్ ఎన్నో మ్యాచుల్లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. 
 
క్రీడా శాఖ ఆధ్వర్యంలో మొత్తం 12 మంది సెలెక్షన్ కమిటీ సభ్యులు ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం మొత్తం నలుగురు క్రీడాకారుల పేర్లను సిఫార్సు చేశారు. ఇక క్రికెట్ నుంచి రోహిత్ శర్మను ప్రతిపాదించారు. ఇక ఈ అవార్డుకు నలుగురు క్రీడాకారులు నామినేట్ కావడం ఇది రెండోసారి మాత్రమే. 
 
2016లో కూడా నలుగురు క్రీడాకారులను రాజీవ్ ఖేల్ రత్న  అవార్డు కోసం సిఫార్సు చేశారు. 2019 సంవత్సరానికి గాను ఈ అవార్డును అందజేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ క్రీడాకారులు సాధించిన రికార్డులను దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం వీరి పేర్లను సిఫార్సు చేసినట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడు వీరేంద్ర సెహ్వాగ్  తెలిపాడు.

మరోవైపు ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు కోసం టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఇషాంత్‌తో పాటు ఆర్చర్ అతాను దాస్, హాకీ క్రీడాకారిణి దీపికా ఠాకూర్, క్రికెటర్ దీపక్ హుడా, టెన్నిస్ క్రీడాకారుడు దివిజ్ శరన్‌తో పాటు మొత్తం 29 మంది అథ్లెట్ల పేర్లను అర్జున కోసం ప్రతిపాదించారు.