నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థతోపాటు ఆ సంస్థ అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే, కేసులో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణంరాజుకు కూడా నోటీసులు జారీ చేసింది.
ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని మాజీ ఐజీ కృష్ణంరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థపై ఆరోపణలకు సంబంధించి ట్రయల్ కోర్టులో దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు గతంలో కొట్టివేసింది. దాంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ అప్పీలు వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యాజ్యంలో రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)ను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ అభ్యర్థనను అంగీకరించి ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చి నోటీసులిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఇంప్లీడ్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
More Stories
ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం