
కరోనా సంక్షోభం దేశీయ కార్పొరేట్ కంపెనీల పనితీరును దారుణంగా దెబ్బతీస్తున్నదని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఇక్రా పేర్కొన్నది. కొన్ని రంగాల్లో, ముఖ్యంగా విమానయాన, ఆతిథ్య, రిటైల్ రంగాల్లో ఈ సంక్షోభ ప్రభావం దీర్ఘకాలంపాటు కొనసాగవచ్చని ఇక్రా హెచ్చరించింది.
కొవిడ్-19 వ్యాప్తిని ప్రతిఘటించేందుకు జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో లాక్‌డౌన్లను పొడిగించడంతో ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశీయ పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపింది.
ఏప్రిల్‌లో దారుణంగా మందగించిన ఆర్థిక కార్యకలాపాలు ఆ తర్వాత పుంజుకోవడం మొదలైనప్పటికీ అన్‌లాక్ దశలో కొవిడ్-19 కేసులు భారీగా పెరుగడం, ఇటీవల పలు రాష్ట్రాలు మళ్లీ ప్రాంతీయంగా లాక్‌డౌన్లు విధించడంతో వృద్ధికి విఘాతం కలిగిందని ఇక్రా పేర్కొన్నది.
ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో అధిక భాగం లాక్‌డౌన్‌లో ఉండటంతో అనేక కంపెనీల రాబడులు గణనీయంగా క్షీణించాయని, దీంతో ఈ త్రైమాసికమంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని స్పష్టం చేసింది. ఈ ఒత్తిడులు ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు కొనసాగవచ్చని వెల్లడించింది.
అయితే, జూలై చివరినాటికి అందుబాటులో ఉన్న హై-ఫ్రీక్వెన్సీ డాటా పాయింట్లను విశ్లేషించి చూస్తే కొన్ని రంగాలు క్రమంగా కోలుకుంటున్నట్టు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపింది.
‘ఈ ఏడాది ఏప్రిల్‌లో దాదాపు పూర్తిగా మందగించిన వాహన అమ్మకాలు ఇప్పుడు మళ్లీ పుంజుకొంటున్నట్టు కనిపిస్తున్నది. కొవిడ్-19కు ముందున్న స్థాయిలతో పోలిస్తే జూలైలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు దాదాపు 85 శాతానికి, ద్విచక్ర వాహన అమ్మకాలు 60 శాతానికి మెరుగుపడ్డాయి. మరోవైపు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ట్రాక్టర్ల అమ్మకాలు 35 శాతం పెరిగినట్టు స్పష్టమవుతున్నది’ అని ఇక్రా వివరించింది.
కాగా, ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉజ్వలంగా ఉన్నట్టు స్పష్టమవుతున్నదని షంషేర్ దివాన్ తెలిపారు.
ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలిస్తుండటం, జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగడంతోపాటు ప్రభుత్వ తోడ్పాటు చర్యలతో ఖరీఫ్‌లో మంచి దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కొవిడ్-19 వ్యాప్తి తగ్గకపోయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ మహమ్మారి ప్రభావం అంతగా లేకపోవడం ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.
More Stories
మరోసారి అత్యంత ధనవంతుడిగా అంబానీ
అంతర్జాతీయంగా భారీగా తగ్గుతున్న ముడి చమురు ధరలు
ఏటీఎంలలో రూ. 2,000 నోట్లపై ప్రభుత్వ ప్రమేయం లేదు