తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.693.80 కోట్లు జమ

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్) ఆరో విడత నిధులు తెలంగాణ రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్‌ నిధులు రూ.17,000 కోట్లు ఆదివారం విడుదల‌ చేయడంతో తెలంగాణలో 34.69 లక్షల మంది ఖాతాల్లో రూ.693.80 కోట్లుజమయ్యాయి. పీఎం కిసాన్‌ ద్వారా ఇప్పటివరకు 6 విడతల్లో రూ.4,168.76 కోట్లు రాష్ట్ర రైతులకు అందాయి.

తొలి విడతగా 2018 డిసెంబర్‌ నుంచి 2019 మార్చి వరకు 37.15 లక్షల మంది రైతులకు రూ. 743.02 కోట్లను కేంద్రం అందించింది. రెండో విడత గత ఏప్రిల్‌ నుంచి జులై వరకు 36.65 లక్షల మందికి రూ. 733.11 కోట్లు ఇచ్చింది. మూడో విడతగా గత ఆగస్టు2019 నుంచి నవంబర్‌ నాటికి 35.11 లక్షల మందికి రూ. 702.33 కోట్లు అందాయి.

నాలుగో విడతలో 33.06 లక్షల మందికి రూ. 661.38 కోట్లు, ఐదో విడత 31.75 లక్షల మందికి రూ. 635.12 కోట్లు అందాయి. తాజాగా ఆరో విడతలో 2020 ఆగస్టు1 నుంచి 2020 నవంబర్‌ వరకు రూ. 2 వేల చొప్పున 34.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 693. 80 కోట్లు జమ చేశారు.

అయితే తెలంగాణలో పీఎం కిసాన్‌ అమలులో రాష్ట్ర ప్రభుత్వ  అధికారుల నిరక్ష్ల్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. కొత్తగా పాస్‌ బుక్‌లు వచ్చిన లక్షలాది మంది రైతులను అధికారులు లబ్ధిదారులుగా గుర్తించట్లేదు. దానితో వారు ప్రయోజనం పొందలేక పోతున్నారు.

కొన్ని జిల్లాల్లో లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్‌ కోసం ఆన్‌లైన్‌ ద్వారా, మొబైల్‌ యాప్‌ల ద్వారా దరఖాస్తు  చేసుకున్నారు. ఇలా రిజిస్ట్రేషన్‌నమోదు చేసుకున్న వాటిని ఆమోదించే బాధ్యత జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకిచ్చారు. కానీ అధికారుల నిరక్ష్ల్యంతో లక్షలాది మంది రైతులు ఆమోదం కోసం నెలల తరబడి వేచి చూస్తున్నారు.

రాష్ట్రంలో 60.95 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలున్నాయి. వీళ్లలో ఈ ఏడాది 57.62 లక్షల మందికి పైగా రైతుబంధు అందింది. కానీ పీఎం కిసాన్‌ ఆరో విడతలో 34.69 లక్షల మందినే గుర్తించారు. దీంతో దరఖాస్తు చేసుకున్నా ఆమోదం లభించక  లక్షల మంది లబ్ధిదారులు పీఎం కిసాన్ డబ్బులు కోల్పోతున్నారని విమర్శలున్నాయి. 

ఏప్రిల్ నుంచి జులై 31 వరకు అనుమతించక పోవడంతో 10 లక్షల మంది ప్రత్యక్షంగా నష్టపోయారని తెలుస్తోంది. పథకం ప్రారంభమైనప్పుడు  ఐదెకరాల్లోపున్న చిన్న, సన్న కారు రైతులకు ఏడాదికి రూ. 6 వేల చొప్పున ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తరువాత భూమి ప్రాతిపదికన కాకుండా రైతులందరికీ వర్తింపజేసింది.