మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ 

తెలంగాణాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా శనివారం ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన సతీమణికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం మంత్రి హోం ఐసొలేషన్‌లో ఉండగా, ఆయన సతీమణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి సైతం కరోనా సోకింది. ఆయన కుటుంబ సభ్యులు సైతం ఇన్ఫెక్షన్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం వారు నానక్‌రాంగూడలోని తమ నివాసంలో హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి పాజిటివ్‌గా తేలింది. ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కాగా, తాను ఆరోగ్యంగా ఉన్నానని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రకటించారు. ఇటీవల కరోనా బారిన పడిన తాను ఐదు రోజుల్లోనే కోలుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు  ఆయన ఓ వీడియోను విడుదలచేశారు. 

‘గత ఆదివారం నాకు కరోనా పాజిటివ్‌గా తేలిం ది. వెంటనే నా భార్యకు టెస్ట్‌చేయిస్తే ఆమెకు కూడా వైర స్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. మా సొంత దవాఖానలో చికిత్స పొందాం. 5 రోజుల్లో కోలుకొని ఇప్పుడు ఐసొలేషన్‌లో ఉన్నాం’ అని తెలిపారు.  

ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2,256 పాజిటివ్‌లు వచ్చాయి. ఇంత భారీగా కేసులు బయటపడటం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 77,513కు చేరింది. గత నాలుగు రోజుల వ్యవధిలోఏకంగా 8,567 మంది వైరస్‌ బారినపడ్డారు.   జీహెచ్‌ఎంసీ పరిధిలో  కొత్తగా 464 కేసులు వచ్చాయి. 

మరోవంక, కోవిడ్ దాడిలో మాజీ ఎంపి నంది ఎల్లయ్య మృతి చెందారు. గత కొన్ని రోజుల క్రిందట దగ్గు, జ్వరం, వంటి లక్షణాలు ఉండటంతో టెస్టులో పాజిటివ్ తేలింది. దీంతో నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. 

 కాగా, శుక్రవారం ఏకంగా 14 మంది వైరస్‌ వల్ల చనిపోయారు. ఒకేరోజు ఇంతమంది చనిపోవడం ఇది మూడోసారి. జూన్‌ 7న, జూలై 31న ఒకరోజే 14 మంది చొప్పున కన్నుమూయగా తాజాగా అదే స్థాయిలో మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య  615కు 

చేరుకుంది.