కేరళలో ఘోర విమాన ప్రమాదం … 19 మంది మృతి 

కేరళలోని కోజికోడ్‌లో ఉన్న కరీపూర్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్‌ నుంచి వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వేపై నుంచి జారి 35 అడుగుల లోయలోకి పడింది. ఈ క్రమంలో విమానం రెండు ముక్కలైంది. ప్రమాదంలో పైలట్‌, కోపైలట్‌ సహా 20 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తుంది. 120 మందికిపైగా గాయపడినట్లు సమాచారం.

క్షతగాత్రులను వెంటనే సమీపంలోని దవాఖానలకు తరలించారు. వారిలో15 మంది పరిస్థితి విషమంగా ఉన్నదని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి 7.41 గంటలప్పుడు ఈ ప్రమాదం సంభవించింది.

ఘటన జరిగిన సమయంలో విమానంలో 190 మంది ఉన్నారు. వీరిలో 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు, ఇద్దరు పైలట్లు, నలుగురు సిబ్బంది. ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం కురుస్తున్నది. దీనివల్లే రన్‌వేపై విమానం చక్రాలు జారి ఉంటాయని భావిస్తున్నారు.

మల్లపురం, వయనాడ్‌ నుంచి రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కరీపూర్‌ విమానాశ్రయం ఎత్తయిన ప్రాంతంలో ఉన్నది. ఎఐఈఏఎక్స్‌బీ1344 బోయింగ్‌ 737 విమానం ప్రమాదానికి గురైనట్లు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ)  తెలిపింది.

పదో రన్‌వేపై ల్యాండయిన తర్వాత విమానం రన్‌వే చివరివరకు వెళ్లిందని, అనంతరం లోయలోకి పడిపోయిందని పేర్కొంది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ఈ విమానం భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. క్రాష్‌ ల్యాండింగ్‌ వల్ల తమ నెట్‌వర్క్‌పై ప్రభావం పడినా, వందేభారత్‌ మిషన్‌ కొనసాగుతుందని తెలిపింది.

విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేరళ సీఎం విజయన్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు ట్వీట్‌ చేశారు. ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విచారం వ్యక్తం చేశారు.

కోజికోడ్‌ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన పైలట్‌ వింగ్‌ కమాండర్‌ దీపక్‌ వసంత్‌ సేథ్‌కు విమానాలు నడుపటంలో మంచి రికార్డు ఉంది. ఆయన భారత వాయుసేనలో యుద్ధవిమానాలు నడిపారు. పైలట్లకు శిక్షణ ఇచ్చారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉండగా 58 ఎన్‌డీఏ ప్రెసిడెంట్‌ గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు.

హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి గౌరవఖడ్గాన్ని కూడా అందుకున్నారు. కోజికోడ్‌లో ప్రమాదానికి గురైన బోయింగ్‌ 737 విమానాలు నడుపటంలో సేథ్‌ది అందెవేసిన చెయ్యి. ఎయిర్‌ ఇండియా కోసం ఆయన ఎయిర్‌బస్‌ 310 విమానాలు కూడా నడిపారు.

రన్‌వే నుంచి జారిన విమానం పక్కనే ఉన్న 34 అడుగుల లోతైన లోయలో పడింది. రాత్రి 7.45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. సరైన వెలుతురు లేని కారణంతో లేదా సాంకేతిక లోపం వల్లనో విమానం రన్‌వే నుంచి పక్కకు జరిగి రెండు ముక్కలు అయినట్లు వెల్లడైంది. ఇదే వేగంతో పక్కన ఉన్న లోయలోకి జారుకుంది. 

భారీ వర్షాలతో రన్‌వేపైకి నీరు చేరుకుందని ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధంగా వర్షం కారణంగానే ముప్పు తలెత్తింది. అయితే సాధారణంగా విమానం రెండుగా పగిలితే లోపల ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతాయి. కానీ భారీ వర్షంతో మంటలు చెలరేగలేదు. దీనితో ప్రయాణికులు సజీవదహనం కాకుండా బయటపడ్డారని ప్రాధమిక అంచనాలో వెల్లడైంది.