రుణాల పునర్వ్యవస్థీకరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనలు, బ్యాంకర్లు-పరిశ్రమ డిమాండ్లను అంగీకరించింది. ఈ క్రమంలోనే వ్యక్తిగత, కార్పొరేట్ రుణగ్రహీతలకు ఊరటనిస్తూ ఏకకాల రుణ పునర్వ్యవస్థీకరణకు సై అన్నది.
గతేడాది జూన్ 7న జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లు తమ రుణాలను వచ్చే ఏడాది మార్చి ఆఖరుదాకా పునర్వ్యవస్థీకరించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్యసమీక్షను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
తాజా పాలసీ రివ్యూలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచాలని పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో 3.35 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 3 శాతంగానే ఉన్నాయి. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ ద్రవ్యోల్బణం పెరుగవచ్చన్న దాస్.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టగలదన్న ఆశాభావాన్ని కనబరిచారు.
గతంలో తగ్గించిన వడ్డీరేట్ల ప్రయోజనాన్ని బ్యాంకులు పూర్తిగా రుణగ్రహీతలకు అందించాలని దాస్ ఈ సందర్భంగా కోరారు. రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలని సూచించారు. మరోవైపు ఈ నెల 31తో రుణాలపై మారటోరియం గడువు తీరిపోతున్నా.. దానిపై దాస్ మాత్రం ఏ రకంగానూ మాట్లాడలేదు. కరోనా వైరస్ దీర్ఘకాల వ్యాప్తి వల్ల దేశ వృద్ధిరేటు బలైపోతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు.
స్టార్టప్లకు మరింత చేయూతనివ్వడానికి సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నది. స్టార్టప్లతోపాటు పునరుత్పాదక రంగాన్ని కూడా ప్రాధాన్య రంగ రుణాల పరిధిలోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అలాగే చిన్న, సన్నకారు రైతులు, బలహీన వర్గాలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి రుణ పరిమితిని కూడా పెంచింది.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ