తొలి ఆన్‌లైన్‌ దేశభక్తి చిత్రోత్సవం  

జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ), తొలిసారిగా ఆన్‌లైన్‌లో దేశభక్తి చిత్రోత్సవం నిర్వహిస్తున్నది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ఈ చిత్రోత్సవం జరుపుతున్నారు.

రేపటి నుంచి 21వ తేదీ వరకు కోనసాగుతుంది.స్వాతంత్య్ర సమరయోధుల ధీరోదాత్త గాథలను ఈ చిత్రోత్సవం లో ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో పండుగ, దేశభక్తి భావాన్ని పెంచడం దీని లక్ష్యం. www.cinemasofindia.com వెబ్‌సైట్‌లో అధిక నాణ్యత గల చిత్రాలను ప్రతిరోజూ ప్రదర్శిస్తారు. ఉచితంగా చూడవచ్చు.

హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, బెంగాలీ, గుజరాతీ, మళయాళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను ప్రదర్శిస్తారు. జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ), నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఐఐ), చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా (సిఎఫ్‌ఎస్‌ఐ), ఫిల్మ్స్ డివిజన్‌ సేకరణల్లోని చిత్రాలను ప్రదర్శిస్తారు.

సర్ రిచర్డ్ అటెన్‌బరో చేతుల్లో రూపుదిద్దుకున్న ‘గాంధీ’ (1982) చిత్రం తొలిసారిగా ప్రదర్శితమవుతోంది. దృష్టి, వినికిడి లోపాలు ఉన్నవారు కూడా ఆనందించవచ్చు. ఈ చిత్రాల లింకులను, ఎంఐబీ వెబ్‌సైట్‌ mib.gov.in లో, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, మైగవ్‌ కు చెందిన సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతారు. విదేశాల్లోని భారత కార్యాలయాలకు పంపేందుకు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా ఈ లింకులను షేర్‌ చేస్తారు.