ఖాదీ అగర్బత్తి ఆత్మనిర్బర్ మిషన్  

ఖాదీ అగర్బత్తి ఆత్మనిర్బర్ మిషన్  

అగర్బత్తీల ఉత్పత్తిలో ఇండియా స్వయం సమృద్ధి సాధించడానికి తోడ్పడటమే కాక ఉపాధి కల్పనకు దోహదం చేసేందుకు ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ త్వరలో ప్రారంభించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ఎంఎస్ఎంఇ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. 

“ఖాదీ అగర్బత్తి ఆత్మనిర్బర్ మిషన్” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు.   దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరుద్యోగులు, వలస కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు దేశంలో అగర్బత్తీల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. 

ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం గతనెలలో ఈ ప్రతిపాదన సమర్పించడం జరిగింది. ప్రయోగాత్మక ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తారు. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేసిన తరువాత అగర్బత్తీల పరిశ్రమలో వేలాదిమందికి ఉపాధి లభించనున్నది.

ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అమలు చేసేందుకు కె వి ఐ సి రూపకల్పన చేసింది. తక్కువ పెట్టుబడితో  ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం దీని ప్రత్యేకత. ప్రైవేటు అగర్బత్తీ ఉత్పత్తిదారులు ఎక్కువ మూలధనం  పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేకుండా  తమ అగర్బత్తీల ఉత్పత్తిని పెంచడానికి ఇది తోడ్పడుతుంది.

ఈ రంగంలో విజయవంతమైన అగర్బత్తీల ఉత్పత్తిదారులను వ్యాపార భాగస్వాములుగా చేర్చుకొని కె వి ఐ సి అగర్బత్తీలు  తయారుచేసే చేతిపని వారికి అగర్బత్తీలు చేసేందుకు అవసరమైన ఆటోమేటిక్ యంత్రాలను,  పొడిని కలిపే యంత్రాలను ఈ స్కీము ద్వారా సమకూరుస్తుంది.

ఇందుకోసం స్థానికంగా  భారతీయ ఉత్పత్తిదారులు తయారుచేసిన యంత్రాలనే సేకరించాలని కె వి ఐ సి నిర్ణయించింది.  తద్వారా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నది లక్ష్యం.