రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా కోసం గ్రామాల్లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వినూత్నంగా నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లలో ‘జీరో’ వ్యాపారం నడుస్తుండటం విస్మయం కలిగిస్తున్నది.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వ్యాపారం చేయాలంటే వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలకు, హోల్‌సేల్, రిటైల్ అమ్మకాలకు నిల్వ చేసే గిడ్డంగులకు సంబంధిత ప్రభుత్వ అథారిటీ నుంచి లైసెన్స్‌లు తప్పనిసరి. కానీ ప్రభుత్వం ప్రారంభించిన ఆర్‌బికెలు, వాటికి అనుబంధంగా నెలకొల్పిన హబ్‌లు (నిల్వ ప్రదేశం-గోడౌన్) లైసెన్స్‌లు లేకుండానే వ్యాపారం సాగిస్తున్నాయి.
ఆర్‌బికెలు, హబ్‌ల లైసెన్స్‌లపై ఇప్పటి వరకు విధి విధానాల నిర్ణయం జరగలేదు. కియోస్క్‌లో ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా రైతుల నుంచి డబ్బు తీసుకొని నిర్ణీత గడువులోపు అందజేస్తున్న వ్యవసాయ ఉత్పాదకాల అమ్మకాలకు అధికారులు ఎలాంటి రసీదులూ ఇవ్వట్లేదు.
దానితో నాసిరకం, నకిలీ ఉత్పాదకాలతో నష్టపోతే చట్ట ప్రకారం బాధిత రైతులకు పరిహారం అందే అవకాశం లేదు. ఈ లసుగులతో ప్రైవేటు కంపెనీలు రైతులకు అన్యాయం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్‌బికెల వ్యాపారంపై జిఎస్‌టి, కంపెనీలిచ్చే డీలర్ మార్జిన్ (కమీషన్)పై పలు సందేహాలు తలెత్తుతున్నాయని వ్యవసాయశాఖ వర్గాలలో చర్చ సాగుతోంది.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వ్యాపారం చేసే ప్రైవేటు డీలర్లతో పాటు ఎపి మార్క్‌ఫెడ్, ఎపి మార్కెటింగ్, ఎపి సీడ్స్, వాటికి అనుబంధంగా ఉన్న డిసిఎంఎస్‌లు, ఎఎంసిలు, ప్యాక్స్ వగైరా ప్రభుత్వ అజమాయిషీలోని సహకార సంస్థలకు లైసెన్స్‌లు ఉన్నాయి.
కానీ ఆర్‌బికెలు, అనుబంధ హబ్‌లు ఎలాంటి లైసెన్స్‌లూ లేకుండా వ్యాపారం చేస్తున్నాయి. క్రిబ్‌కో వంటి ప్రభుత్వరంగ సంస్థలైనా, ప్రైవేటు కంపెనీలైనా తమ ఉత్పత్తులను హోల్‌సేల్‌గా, రిటైల్‌గా విక్రయించే డీలర్లకు ఎంఆర్‌పిలో కొంత మేర ట్రేడ్ మార్జిన్ (కమీషన్) ఇస్తాయి. ఆ విధంగా ఆర్‌బికెలకు, హబ్‌లకు ఇచ్చే కమీషన్ లావాదేవీలపై అస్పష్టత నెలకొందని ఆరోపణలస్తున్నాయి.
మార్జిన్ వివరాలు అధికారికంగా నిర్ణయించలేదని సమాచారం. ఏదైనా వస్తువుల వ్యాపారంపై జిఎస్‌టి చెల్లించాలి. ప్రస్తుతం సీడ్‌పై జిఎస్‌టి లేదు. ఎరువులు, పురుగుమందుల బిజినెస్‌పై జిఎస్‌టి ఉంది. వాటి వ్యాపారం చేసే ఆర్‌బికెలు చెల్లించాల్సిన జిఎస్‌టిపై క్లారిటీ లేదని చెబుతున్నారు.
చట్ట ప్రకారం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారం చేసే డీలర్లు, కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి. రసీదుపై వస్తువులను స్వీకరించిన వినియోగదారు, అమ్మేవారు తప్పనిసరిగా సంతకం చేయాలి. ఆ వస్తువుల వలన తదుపరి నష్టం జరిగితే రైతులు నష్టపరిహారాన్ని డిమాండ్ చేయాలంటే రసీదులే ఆధారం.
కానీ ఆర్‌బికెలలో రైతులకు రసీదులు ఇవ్వట్లేదు. కియోస్క్‌లో ఆన్‌లైన్ బుకింగ్, ఆన్‌లైన్ పేమెంట్స్, మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌లే ఆధారమని చెబుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల చట్టాల ప్రకారం కచ్చితంగా రైతులు ఒరిజినల్ రసీదులను చూపాలి. అవి లేకపోతే కంపెనీల అక్రమాలపై కోర్టులెక్కినా ఉపయోగం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ప్రభుత్వ వాదన మరొకలా ఉంది. కంపెనీలతో ఎంఒయులు చేసుకున్నాక, హబ్‌లకు ఉత్పాదకాలను పంపుతారని, అక్కడ ర్యాండమ్ శాంపిల్స్ తీసి నాణ్యతా పరీక్షలు చేస్తారని చెబుతోంది.
More Stories
నేడే శ్రీవారి బ్రహ్మోత్సవ అంకురార్పణం
పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
అమరావతికి ప్రపంచ బ్యాంకు తొలివిడతలో రూ.3750 కోట్లు