యుపి సాంకేతిక విద్యా మంత్రి మృతి

కరోనా బారినపడి ఉత్తరప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్ రాణి వరుణ్ (62) మృతిచెందారు. కమల్ రాణి జూలై 18న కరోనావైరస్ పరీక్షల కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆమెకు పాజిటివ్ రావడంతో ఆమెను సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. 

అక్కడ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు ఇన్ఫెక్షన్ కు గురికావడంతో ఆదివారం ఉదయం మరణించారు. ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్ బారినపడి మరణించిన మొదటి మంత్రి కమల్ రాణి కావడం గమనార్హం. ఆమె మృతిపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘కమల్ రాణి వరుణ్ ఆదివారం ఉదయం 9.30 గంటలకు మరణించారు. ఆమె అనుభవంతో పాటు సమర్థవంతమైన నాయకురాలు. ఆమె తన బాధ్యతలను సమర్థతతో నిర్వర్తించింది. ఆమె అంకితభావంతో కూడిన ప్రజా ప్రతినిధి. సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండేది’ అని కొనియాడారు.

కమల్ రాణి ప్రస్తుతం కాన్పూర్ లోని ఘటంపూర్ నుండి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె లోక్‌సభ ద్వారా రెండుసార్లు పార్లమెంటు సభ్యురాలుగా కూడా పనిచేసింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,068గా ఉంది. కరోనావైరస్ కారణంగా యూపీలో శనివారం మరో నలభై ఏడు మంది మరణించారు. దాంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1,677గా ఉంది.