ఆగస్టు 31 వరకు తమిళనాడులో లాక్‌డౌన్‌  

తమిళనాడులో కరోనా వ్యాపి కొనసాగుతూ కేసుల సంఖ్య రోజు రోజుకూ భారీ గా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు నెలలోని ప్రతీ ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించనుండగా మిగతా రోజుల్లో కొన్నింటికి సడలింపులు ఇచ్చారు. 

లాక్‌ డౌన్‌ గడువు శుక్రవారం (జులై-31)తో ముగియనుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్రాష్ట రవాణాపై నిషేధం కొనసాగనుంది. అంతర్‌ జిల్లా ప్రయాణానికి ఈపాస్‌ తప్పనిసరి చేసింది. అన్ని వాణిజ్య, ప్రైవేట్ సంస్థల్లో శ్రామిక శక్తిని 75 శాతం పెంచుకునేందుకు వీలు కల్పించింది. 

మతపరమైన సమావేశాలు, మెట్రోరైలు రవాణాతోసహా ప్రజారవాణాపైన, షాపింగ్ మాల్స్, అంతర్రాష్ట ప్రజా, ప్రైవేట్ రవాణా పైన యధావిధిగా ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లలో భోజన సర్వీసులను అందించేందుకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. 

అంతేకాదు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతామని పళనిస్వామి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం పాటు పలు జాగ్రత్తలతో వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు.