బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరుపుతున్న తీరు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ఏజెన్సీల ద్వారా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ పెరుగుతున్నది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విచారించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. భారీ మొత్తంలో సుశాంత్ డబ్బును అక్రమ రీతిలో వాడుకున్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
సుశాంత్ అకౌంట్ నుంచి సుమారు రూ 15 కోట్లను రియా చక్రవర్తి వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమెను విచారించాలన్న డిమాండ్ పెరుగుతున్నది. అంత భారీ స్థాయిలో మొత్తాన్ని ఎలా సుశాంత్ అకౌంట్ నుంచి ఖాళీ అయ్యిందో తేలాల్సిన అవసరం ఉందని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
కేసు విచారణ నిమిత్తం ముంబై వెళ్లిన బీహార్ పోలీసులు.. రియాను కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రియాతో పాటు ఆమె సోదరుడు, తల్లితండ్రులు అక్రమరీతిలో సుశాంత్ డబ్బును వాడినట్లు గుర్తించారు. కేసును సీబీఐకి అప్పగించకున్నా కనీసం ఈడీకి ఇవ్వాలని, ఎందుకంటే దీంట్లో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఉన్నాయని ఫడ్నవీస్ తెలిపారు.
మరోవంక, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుపై బీహార్ పోలీసులు జరుపుతున్న న్యాయమైన దర్యాప్తును ముంబై పోలీసులు అడ్డుకుంటున్నారని బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. తమ రాష్ట్ర పోలీసుల దర్యాప్తునకు ముంబై పోలీసులు సహకరించడంలేదని ఆయన విమర్శించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోరుతున్నదని ఒక ట్వీట్ లో వెల్లడించారు.
మరోవంక, సుశాంత్ సింగ్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. ఈ కేసు విషయంలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్నదని విచారం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని అన్ని రాజకీయ పార్టీల నేతలు కోరుతున్నారని, ఇదే విషయంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చిరాగ్ మాట్లాడారని పాశ్వాన్ చెప్పారు
More Stories
నీట్ పేపర్ లీకేజ్లో 144 మందికి ప్రశ్నాపత్రం
మణిపూర్లో భారీగా ఆయుధాలు లభ్యం
రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర