
సైన్యానికి సంబంధించిన పరికరాల కొనుగోళ్లలో ముడుపులు తీసుకున్న కేసులో సమతాపార్టీ మాజీ అధ్యక్షురాలు జయాజైట్లీకి ఢిల్లీలోని సీబీఐ కోర్టు నాలుగేండ్ల జైలుశిక్ష విధించింది. ఈ కేసులో దోషులుగా తేలిన సమతాపార్టీ మాజీ నేత గోపాల్ పచేర్వాల్, రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌పీ ముైర్గెకి కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ భట్ నాలుగేండ్ల చొప్పున జైలుశిక్ష విధించారు.
ముగ్గురికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించారు. అయితే, సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ హైకోర్టు జయాజైట్లీ శిక్షను సస్పెండ్ చేసింది. రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. సీబీఐకి నోటీసులు జారీచేసింది.
ఈ కేసులో జయాజైట్లీని అరెస్టు చేయలేదు కాబట్టి శిక్షను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ తెలిపారు. అంతకుమందు సీబీఐ కోర్టు దోషులు ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 120బీ (కుట్ర), అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9 (లంచం తీసుకోవటం) కింది మోపిన అభియోగాలు నిజమని తేలాయి. తాము పోలీసుల ముందు లొంగిపోయేందుకు ఆగస్టు 5 వరకు సమయం ఇవ్వాలని మిగతా ఇద్దరు నిందితులు ట్రయల్ కోర్టులో అప్పీల్ చేశారు.
2000-01లో తెహెల్కా పత్రిక స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ అవినీతి కేసును బయటపెట్టింది. డిసెంబర్ 2000, జనవరి 2001 మధ్య పలు దఫాలుగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ దేశంలో రాజకీయ దుమారం రేపింది. వెస్టెండ్ అనే నకిలీ కంపెనీ పేరుతో సైన్యానికి థర్మల్ ఇమేజెస్ పరికరాలు అమ్ముతామంటూ తెహెల్కా విలేకరి మాథ్యూ సామ్యూల్ నాడు సమతాపార్టీ అధ్యక్షురాలిగా ఉన్న జయాజైట్లీతోపాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలతో సంప్రదింపులు జరిపారు.
ఇదే పార్టీకి చెందిన ప్రముఖ నేత జార్జిఫెర్నాండేజ్ నాటి ఎన్‌డీఏ (వాజపేయి) ప్రభుత్వంలో రక్షణమంత్రిగా ఉన్నారు. కాంట్రాక్టు తమకే లభించేలా ఫెర్నాండేజ్‌ను ఒప్పించాలంటూ జయాజైట్లీ తదితరులకు సామ్యూల్ లంచాలు ఎరవేశారు. ఈ వ్యవహారాన్నంతా రహస్య కెమెరాలతో చిత్రీకరించారు.
జయాజైట్లీ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. గోపాల్ రూ.20,000, ముైర్గె రూ.20,000 లంచం తీసుకున్నారు. రక్షణమంత్రి జార్జిఫెర్నాండెజ్ కార్యాలయంలోనే ఈ లంచాలు తీసుకోవటం విశేషం.
More Stories
ఆప్ నేతలపై రూ. 2,000 కోట్ల అక్రమాలు జరిపినట్లు కేసు
మెహుల్ ఛోక్సీకి బెల్జియం కోర్టులో ఎదురుదెబ్బ
ఇక వెయిటింగ్ టికెట్తో స్లీపర్ క్లాస్లో ప్రయాణించలేరు!