బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు 

ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు సోము వీర్రాజును నియమించారంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జ్‌ అరుణ్‌ సింగ్‌ సోమవారం  రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే వీర్రాజుకు గతంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని అంతా  భావించినా  చివరిలో కన్నా నియామకం జరిగింది.

సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరు గ్రామానికి చెందిన సోము సూర్యారావు, గంగమ్మ దంపతులకు 1957లో జన్మించారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన ఆయన బీఎస్సీ చదివారు. వృత్తి వ్యాపారం. వీర్రాజు మొదటి నుంచి బీజేపీతోనే ఉన్నారు. జనతా పార్టీలో రాజకీయ ప్రవేశం చేసిన ఆయనకు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి.

1978లో జనతా యువమోర్చానగర ప్రధాన కార్యదర్శిగా అరంగేట్రం చేశారు 1980లో యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా,  1982–1984 వరకు బీజేపీ జిల్లా కార్యదర్శిగా, 1987–90 వరకు యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 1991–94 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 1994–96 వరకు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

1996–2003 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా,  2003 నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2006–10 వరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010–13 తిరిగి రెండోసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013–14 వరకు మొదటిసారి, 2014 నుంచి ఇప్పటి వరకు రెండోసారి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. 2015 నుంచి 2018 వరకు ఆయన శాసనమండలి బీజేపీ పక్షనేతగా వ్యవహరించారు.   పార్టీ నిర్ణయానికి సర్వదా కృతజ్ఞుడను అని తన నీయమాకంపై స్పందిస్తూ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షాలు పార్టీకి, రాష్ట్రానికి ఒక మంచి దిశను అందించారని కొనియాడారు.