రహస్యంగా 90 శాతం సచివాలయం కూల్చివేత 

అత్యంత రహస్యంగా సచివాలయం భవనాలను దాదాపు 90 శాతం వరకు కేసీఆర్ ప్రభుత్వం కూల్చివేసింది. సీఎం చాంబర్, సీఎంవో ఆఫీసర్లుండే సమత బ్లాక్​ (సీ బ్లాక్​) కనిపించకుండా పోయింది. పక్కనే ఉన్న ఏ, బీ బ్లాక్​లు, అధునాతనంగా కనిపించే డీ బ్లాక్​ భవనాలను పునాదుల వరకు పెకిలించారు.  అయిదు అంతస్తులున్న ఈ బిల్డింగ్​లన్నీ ఇప్పటికే ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ ప్రాంతం దాదాపుగా చదును చేశారు. 

సచివాలయం ప్రాంగణంలో ఉన్న గుడి, మసీదులు పూర్తిగా కూల్చేశారు. డీ బ్లా క్ పక్కన ఉండే పురాతన రాక్ బిల్డిం గ్ , నిజాం కాలం నాటి జీ బ్లా క్ ను భారీ హైడ్రాలిక్ మెషిన్లతో పడగొట్టారు . మీడియా పాయింట్ గా ఉండే చిన్న హాల్ తప్ప.. విభజన సందర్భంగా తెలంగాణకు కేటాయించిన బ్లాక్ లన్నీ శిథిలమయ్యాయి.

సువిశాలంగా ఉండే సచివాలయం ప్రాంగణం మొత్తం ఇప్పుడు ఇటుకలు, రాళ్లు, సిమెంట్ దిబ్బల కుప్పగా కనిపిస్తోంది. అత్యంత రహస్యంగా సచివాలయం భవనాలను ప్రభుత్వం కూల్చేయటం ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. చుట్టుపక్కల కిలోమీటర్ దూరం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించి, వేలాది మంది పోలీసుల కాపాలా నడుమ అర్ధరాత్రి కూల్చివేత పనులు ప్రారంభించటం అనుమానాలకు తెరలేపింది. 

కనీసం మీడియా కవరేజీకి కూడా అవకాశం  లేకుండా అడ్డుకోవటం, పరిసరాల్లోకి ప్రవేశం  లేకుండా పోలీసులతో కట్టడి చేసింది. ఇంతకాలం పరిపాలన కేంద్రం గా ఉన్న సచివాలయం కూల్చివేత రహస్యంగా ఉంచటం అన్యాయమని, ప్రజా ధనంతో కట్టిన భవనాలను పడగొట్టేప్పుడు ఫొటోలు, వీడియోలు తీయకుండా కవరేజీని అడ్డు కోవటం మీడియా స్వేచ్ఛను కాలరాయటమేనని ఇటీవలే వీ6, వెలుగు దినపత్రిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

రాజ్యాంగంలోని 19 (1) (ఎ) ఆర్టికల్ ను ప్రభుత్వం తుంగలో తొక్కిందని హైకోర్టుకు నివేదించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సచివాలయంను రహస్యంగా ఎందుకు కూలుస్తున్నారు? వేలాది మంది పోలీసుల కాపలా ఎందుకు? మీడియా కవరేజీని ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రజలు అటువైపు వెళ్లకుండా పోలీసులను ఎందుకు రంగంలోకి దింపారు? అంటూ హైకోర్టు వరుసగా ప్రభుత్వాన్ని కార్నర్ చేసింది. పరిసరాల్లోకి, చుట్టుపక్కల ఉన్న భావనాలపైకి కూడా అనుమతించకపోవటాన్ని తప్పు పట్టింది.

సచివాలయం భవనాల‌ కూల్చివేత పనుల్ని చిత్రీకరించేందుకు సమీప భవనాలపైకి మీడియా ప్రతినిధులు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోరాదని హైకోర్టు శుక్రవారమే మధ్యంతర ఉత్తర్వులు జా రీ చేసింది.   దానితో ప్రభుత్వం కొంతమేరకు దిగివచ్చింది.