అయోధ్య రాముడికి ఆదిత్యనాథ్ పూజ‌లు

అయోధ్య రాముడికి ఆదిత్యనాథ్ పూజ‌లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఇవాళ అయోధ్య‌లో ప‌ర్య‌టించారు.   రామ జన్మభూమి ఆలయం వద్దనున్న నూతన ఆసనాలపై లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలను ప్రతిష్టించి పూజలు జరిపారు. 

సుప్రీం తీర్పు నేప‌థ్యంలో అయోధ్య‌లో ఆగ‌స్టు 5వ తేదీన రామాల‌య నిర్మాణం కోసం భూమిపూజ జ‌ర‌గ‌నున్న‌ది. ఆ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని నరేంద్ర మోదీతో పాటు పలు  రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజ‌రుకానున్నారు.ఈ నేప‌థ్యంలో సీఎం యోగి ఇవాళ అక్క‌డ జ‌రుగుతున్న ప‌నులు ప‌ర్య‌వేక్షించారు. శంకుస్థాప‌న గురించి శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్ట్‌, స్థానిక అధికారుల‌తో సీఎం యోగి చ‌ర్చించారు.

అయోధ్య దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రధాని మోడీ అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నారని చెబుతూ కచ్చితంగా అయోధ్యని దేశం, ప్రపంచం గర్వించదగేలా చేస్తామని భరోసా వ్యక్తం చేశారు. రాముడు 14 ఏళ్ల తర్వాత వనవాసం నుంచి తిరిగివచ్చినట్లుగా భావించి ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించాలని కోరారు. 

“ఈ మంచి కార్యక్రమాన్ని మనం అందరం కలిసి చేసుకుందాం. ఆగస్టు 4, 5 న దేశంలో అందరి ఇళ్లలో దీపాలు పెడదాం. అయోధ్య లేకుండా దీపావళి పండుగను వూహించలేం” అని యోగి పిలుపిచ్చారు. 

హ‌నుమాన్ గ‌ర్హిలో ఉన్న  హ‌నుమంతుడికి కూడా యోగి పూజ‌లు చేశారు. ఆయ‌న త‌ర్వాత ఆయ‌న‌ ప్ర‌త్య‌క్షంగా ప‌నులు ప‌ర్య‌వేక్షించారు. రామాల‌యం కోసం తెచ్చిన శిల‌ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. శంకుస్థాప‌న కోసం అయిదు వెండి ఇటుక‌ల‌ను కూడా తీసుకువ‌చ్చారు.  విశ్వ‌హిందూ ప‌రిష‌త్ త‌యారు చేసిన డిజైన్ ప్ర‌కార‌మే ఆల‌యాన్ని నిర్మించ‌నున్నారు.