ఎల్ఏసీ వ‌ద్ద భారీ ఎత్తున చైనా దళాలు 

తూర్పు ల‌డ‌ఖ్ సెక్టార్‌లోని వాస్త‌వాధీన రేఖ వెంట ఉన్న చైనా ద‌ళాలు.. పూర్తి స్థాయిలో వెన‌క్కి వెళ్ల‌లేద‌ని తాజా నివేదిక ద్వారా వెల్ల‌డైంది. అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ స్ట్రాట్‌ఫ‌ర్ త‌న శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విష‌యాన్ని ద్రువీక‌రించింది. జూలై 22వ తేదీన ఈ నివేదిక‌ను ప్ర‌చురించింది.

ఆ నివేదిక ప్ర‌కారం ల‌డ‌ఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ వెంట సుమారు 50 చైనా శిబిరాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎల్ఏసీ వెంట చైనా నిర్మించిన‌ స‌‌పోర్ట్ బేస్‌లు, హెలిపోర్ట్‌లు ఉన్న‌ట్లు ఆ నివేదిక చెప్పింది. దీంట్లో 26 కొత్త క్యాంపులు, 22 కొత్త స‌పోర్ట్ బేస్‌లు, రెండు కొత్త హెలిపోర్ట్‌లు ఉన్నాయి. చాలా భారీ ఎత్తున్న చైనా ద‌ళాలు ఎల్ఏసీ వ‌ద్ద మోహ‌రించిన‌ట్లు ఆ శాటిలైట్ చిత్రాల్లో వెల్ల‌డైంది.

గ‌తంలో కుదిరిన శాంతి ఒప్పందాల‌ను కాల‌రాస్తూ చైనా త‌న దళాల‌ను మోహ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఎల్ఏసీ వెంట స్వ‌ల్ప సంఖ్య‌లో ద‌ళాల‌ను మోహ‌రించాల‌ని 1993లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింది. ప‌ర‌స్ప‌రం ద‌ళాల సంఖ్య‌ల‌ను త‌గ్గించుకోవాల‌ని 1996లోనూ మ‌రోసారి ఒప్పందం కుదిరింది.

స‌రిహ‌ద్దు వెంబ‌డి చైనా నిర్మిస్తున్న దాంట్లో కొన్ని తాత్కాలిక‌మైన‌వి, కొన్ని శాశ్వ‌త‌మైన నిర్మాణాలు ఉన్న‌ట్లు స్ట్రాట్‌ఫ‌ర్ త‌న నివేదిక‌లో చెప్పింది.  మే నెల నుంచి చైనా త‌న ద‌ళాల‌ను పెంచుకుంటున్న‌ద‌ని, ల‌డ‌ఖ్‌లో ఉన్న నీటి వ‌న‌రుల‌ను కూడా వ‌శం చేసుకునేందుకు చైనా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స్ట్రాట్‌ఫ‌ర్ చిత్రాల ద్వారా బ‌హిర్గ‌త‌మైంది.

ల‌డ‌ఖ్‌లోని వివాదాస్ప‌ద ప్రాంతానికి ఈ వేస‌విలో సుమారు ప‌దివేల మంది చైనా సైనికులు వ‌చ్చి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. నాలుగుసార్లు జ‌రిగిన కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌ల త‌ర్వాత‌.. గాల్వ‌న్ వ్యాలీ, ఫింగ‌ర్ 14 , పాన్‌గాంగ్ స‌ర‌స్సు, హాట్ స్ర్పింగ్స్ నుంచి స్వ‌ల్ప స్థాయిలో చైనా త‌న ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించిన‌ట్లు తెలుస్తోంది.