ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా సోకిందని సీరమ్‌ ‌సర్వేలో వెల్లడైంది. నగరంలోని మొత్తం జనాభాలో 23.48 శాతం మంది వైరస్‌‌ బారిన పడ్డారని, వీళ్లలో చాలా మందిలో లక్షణాలేవీ లేవని తెలిసింది. ఢిల్లీ ప్రభుత్వం, నేషనల్‌ సెంటర్‌‌ ఫర్‌ ‌డిసీజ్‌ ‌కంట్రోల్‌ (ఎన్‌‌సీడీసీ) కలిసి జూన్‌ 27 నుంచి జులై 10 మధ్య చేసిన ఈ సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ  వెల్లడించింది.
 
 ‘దేశంలో వైరస్‌‌వ్యాప్తి మొదలై 6 నెలలైంది. అత్యధిక జనసాంద్రత ఉన్న ఢిల్లీ నగరంలో ఇప్పటివరకు 23 శాతం మందికే కరోనా సోకింది. సరైన టైమ్‌‌లో లాక్‌‌డౌన్‌ పెట్టడం.. కంటెయిన్‌‌మెంట్‌, సర్వెయిలెన్స్‌ విధానాలు అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైంది’ అని ఆరోగ్య శాఖ చెప్పింది. 
 
నగరంలో ఇంకా చాలా వరకు జనం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరముందంది. ఢిల్లీలోని 11 జిల్లాల్లో సర్వే జరిగింది. ఎంపిక చేసిన 21,387 మంది నుంచి బ్లడ్‌‌ శాంపుల్స్‌ సేకరించి టెస్టులు చేశాదు. ఇంతకుముందు కరోనా వైరస్‌‌సోకి యాంటీ బాడీస్‌‌డెవలప్‌‌ అయి ఉంటే సీరమ్‌‌ టెస్టు ద్వారా తెలుస్తుంది.  
 
కేసుల సంఖ్య తగ్గడాన్ని, ఢిల్లీ జనాభాలో 23 శాతం మందికిపైగా ఇప్పటికే వైరస్‌ సోకిందని సీరో సర్వేలో తేలడాన్ని కలిపి చూస్తే.. ఆ రాష్ట్రం హెర్డ్‌ ఇమ్యూనిటీ దిశగా సాగుతున్నట్టుగా కనిపిస్తోందని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. తగిన జాగ్రత్తలతో పాఠశాలలు, కళాశాలలను తెరవడం ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించవచ్చని ఎయిమ్స్‌ వైద్యులు చేసిన సూచన కూడా ఈ కోణంలో చూస్తే కొంతమేరకు సరైనదేననే అభిప్రాయం వినిపిస్తోంది.