ప్రశాంత్‌భూషణ్‌పై కోర్టు ధిక్కార కేసు 

న్యాయ వ్యవస్థపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలతో ట్వీట్లు చేశారనే అభియోగాలతో సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌పై సుప్రీంకోర్టు  సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదుచేసింది. ఆయన తన వ్యాఖ్యలను పోస్టు చేసిన సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ ట్విటర్‌నూ ఈ కేసులో చేర్చింది.

దీనికి సంబంధించిన విచారణ జస్టిస్‌ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట నేడు జరగనుంది. కరోనా సంక్షోభ వేళ వలస కార్మికులు పడిన ఇబ్బందులపై సుప్రీంకోర్టు స్పందించిన తీరుపై ప్రశాంత్‌ భూషణ్‌ గతంలో వివాదాస్పద ట్వీట్లు చేశారు.

భీమా-కోరెగావ్‌ కేసులో జైలులో ఉన్న సామాజిక కార్యకర్త వరవరరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానాలు పదేపదే తోసిపుచ్చడాన్ని తప్పుపడుతూ ఇటీవల ఆయన ఓ ట్వీట్‌ చేశారు.

అయితే సుమోటో కేసు నమోదు చేసేందుకు వీటిలో ఏ ట్వీట్‌ను సుప్రీంకోర్టు ప్రాథమిక సాక్ష్యాధారంగా పరిగణనలోకి తీసుకుందనేది తెలియరాలేదు.