భారత్ – చైనా సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొనకుండా ఆ దేశంతో సామరస్య సంబంధాలను కలిగి ఉండడం సాధ్యం కాదని చైనా, భూటాన్ లలో గతంలో భారత రాయబారిగా పనిచేసిన గౌతమ్ బంబావాలే స్పష్టం చేశారు. సైనిక, రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఆర్ధిక ప్రయోజనాలు పొందలేమని తేల్చి చెప్పారు.
ఫ్రెండ్స్ అఫ్ ట్రైబల్ సొసైటీ తో కలసి భారత్ ఛాంబర్ అఫ్ కామర్స్ జరిపిన వెబినార్ లో “భారత్ – చైనాలు వాణిజ్య యుద్ధం జరపాలా?” అంశంపై మాట్లాడుతూ సైనిక ఘర్షణలను పక్కన బెట్టి ఆ దేశంతో వ్యాపార ప్రయోజనాలు కొనసాగించాలని కొందరు చేస్తున్న వాదనలను తిప్పికొట్టారు.
పాకిస్థాన్ లో భారత్ హై కమీషనర్ గా కూడా పనిచేసిన ఆయన తూర్పు లడఖ్ లో చైనా సైనిక చర్య పట్ల దూకుడుగా వ్యవహరించడం ద్వారా ఆసియాలో సైనిక బలప్రదర్శన ద్వారా తమ ఆధిపత్యం నెలకొల్పుకునే చైనా ఎత్తుగడలను సాగనివ్వమనే సంకేతాలు ఇచ్చినదని చెప్పారు.
డిసెంబర్, 1998లో చైనాలో ప్రయత్నించిన రాజీవ్ గాంధీ చైనా అధినేతలతో కలసి సరిహద్దులో ప్రశాంతత లేకుండా రెండు దేశాల మధ్య దౌత్య, రాజకీయ, ఆర్ధిక సంబంధాలు మెరుగు పడటం సాధ్యం కాదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం ఒక వంక ప్రయత్నం చేస్తూనే రెండు దేశాల సైన్యాలు పరస్పరం సహనంతో వ్యవహరించాలని ఒప్పందం చేసుకున్నాయని చెప్పారు.
అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని తూర్పు లడఖ్ లో చైనా అతిక్రమించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సైనికంగా చైనాకు గట్టి జవాబు చెప్పిన భారత్ విధానపరంగా కూడా తగు రీతిలో సమాధానం చెప్పాలని ఆయన సూచించారు. 59 చైనా యాప్ లను నిషేధించడం ద్వారా ఆ దిశలో తొలి అడుగు వేశామని కొనియాడారు.ఆ దిశలో మరిన్ని చర్యలు తీసుకోవలసి ఉన్నదని గౌతమ్ బంబావాలే పేర్కొన్నారు.
భారత్ పై చైనా దూకుడుగా వ్యవహరించడాన్ని ఆర్ధిక, సైనిక, దౌత్య, రాజకీయ రంగాలలో స్పష్టంగా తెలియ చెప్పాలని స్పష్టం చేశారు. ముందు ఆసియాలో, ఆ తర్వాత ప్రపంచంలో సూపర్ పవర్ గా ఎదగాలని ఆరాట పడుతున్న చైనాకు భారత్ పోటీ కావచ్చనే భయంతో అన్ని రంగాలలో భారత్ ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు గమనించాలని హెచ్చరించారు.
చైనా మనమీద ఎంత దూకుడుగా వ్యవహరిస్తూ అంతర్జాతీయంగా భారత్ అంతగా బలోపేతం అవుతుందని గౌతమ్ భరోసా వ్యక్తం చేశారు. ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకలు మన సముద్ర తీరంలోకి వచ్చి మన నావికాదళంతో కలసి విన్యాసాలు చేయనున్నామని గుర్తు చేశారు. మరోవంక అమెరికాతో పాటు జపాన్, ఆస్ట్రేలియా కూడా భారత్ తో కలసి ఉమ్మడిగా నావికా విన్యాసాలు జరిపే అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు.
5జి సాంకేతికతతో కూడా చైనా కంపెనీలు పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఆయన భారత ప్రభుత్వాన్నికి సూచించారు. ఆ విధంగా చేయడం ద్వారా భారత్ లో గల విస్తృతమైన టెలికాం మార్కెట్ అవకాశాలు చైనాకు దక్కకుండా చేయవచ్చని చెప్పారు. అయితే ప్రస్తుత తరుణంలో చైనాతో పూర్తిగా దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకోమని తాను సూచించడం లేదని స్పష్టం చేశారు.
అయితే మన సామర్ధ్యాన్ని పెంచుకోవడం ద్వారా చైనాపై ఆధారపడడాన్ని నియంత్రించాలని సూచించారు. తూర్పు లడఖ్ లో ప్రదర్శించిన దూకుడుకు తాను భారీ మూల్యం చెల్లింపవలసి వస్తుందనే సంకేతాన్ని ఆ దేశానికి స్పష్టంగా ఇవ్వాలని పేర్కొన్నారు. తెలివిగా ఆ దేశపు ఎత్తుగడలను తిప్పి కొట్టాలని చెప్పారు.
ఔషధ, ఎలక్ట్రానిక్ రంగాలలో మనం చైనా దిగుమతులపై ఆధారపడి ఉన్నామని గౌతమ్ గుర్తు చేశారు. క్రమంగా ఈ రంగాలలో మన సామర్ధ్యాన్ని పెంచుకొనే ప్రయత్నం చేయడం ద్వారా ఆయా రంగాలలో చైనాపై ఆధారపడడాన్ని తగ్గింప వచ్చని చెప్పారు.
అయితే మన ఎత్తుగడలను చైనా కఠినంగా తిప్పి కొట్టే ప్రయత్నం చేసిందని గౌతమ్ హెచ్చరించారు. అప్పుడు తాత్కాలికంగా మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదని స్పష్టం చేశారు. అయితే తాత్కాలికంగా ఇబ్బందులకు సిద్ధపడితే దీర్ఘకాలంలో ప్రయోజనం పొందుతామని భరోసా వ్యక్తం చేశారు.
More Stories
నేషనల్ కాన్ఫరెన్స్ ఎల్పీ నేతగా ఒమర్ అబ్దుల్లా
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
సంఘ్ పాటల ద్వారా సామరస్యం