అభివృద్ధి పనులు కోరిన గ్రామస్తులపై నక్సల్స్ దాడి 

మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నచోట అభివృద్ధి పనులు సాధ్యం కాదని మరోసారి రుజువైనది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా పర్చేలి గ్రామంపై నక్సల్స్‌ దాడి చేశారు. అధికారులను అభివృద్ధి పనులు చేపట్టాలని కోరినందుకు ఆ గ్రామస్తులను తీవ్రంగా కొట్టారు.

దీంతో పిల్లలు, మహిళలతోపాటు 25 మందికి గాయాలయ్యాయి. వారిలో ఎనిమిది మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇటీవల పర్చేలి గ్రామానికి వెళ్లిన జిల్లా కలెక్టర్‌తో సమావేశమైన గ్రామస్తులు తమకు రోడ్డు నిర్మించాలని, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

ఈ సంగతి తెలియగానే సుమారు 10-15 మంది సాయుధ నక్సల్స్‌ శుక్రవారం గ్రామంపై దాడి చేసి.. అభివృద్ధి పనులు చేయాలని కోరినందుకు గ్రామస్తులను కర్రలతో కొట్టారు. ఈ సంగతి తెలియగానే ఆదివారం పోలీసులు అంబులెన్స్‌తో గ్రామానికి వెళ్లారు. వారిని చికిత్స కోసం సమీప కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు.

పరిస్థితి తీవ్రంగా ఉన్న ఎనిమిది మందిని జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. 17 మందికి ప్రాథమిక చికిత్స చేసి పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ చెప్పారు.