భారత్ లో క్రమంగా తగ్గుతున్న కరోనా మరణాలు 

ఇతర దేశాలతో పోల్చితే కొవిడ్‌ సోకినవారిలో మరణాల రేటు భారత్‌లోనే అతితక్కువ 2.42గా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ  తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ఇది 2.82గా ఉన్నదని తర్వాత గణనీయంగా తగ్గుతూ వస్తున్నదని పేర్కొన్నది.  కరోనా       ప్రభావం ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి సారిగా 2.5 కంటే దిగువగా వచ్చిందని చెప్పింది.

14 రాష్ట్రాలలో మరణాల రేటు ఒకటి కంటే తక్కువగా ఉన్నదని తెలిపింది. కరోనా కట్టడి వ్యూహాలు, టెస్టుల్లో వేగం, వైద్య విధానం వల్లే ఇది సాధ్యమైందన్నది. తెలంగాణలో మరణాల రేటు 0.93 ఉన్నది. మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి వేగం తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నది.

శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో 38,902 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,77,618 కి పెరిగింది. కొత్తగా 543 మంది చనిపోవడంతో మొత్తం మృతులు 26,816కు చేరాయి. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని కొత్తగా 23,672 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 6,77,422 మంది కోలుకున్నారు. ఇంకా 3,73,379 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవంక, ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 6,01,549కు చేరాయి. శనివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2,59,848 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. చైనాలోని ఉరుంఖీ నగరంలో కొత్తగా 13 కొత్త కేసుల నమోదుతో మొత్తం 30 పాజిటివ్‌ కేసులు వచ్చినట్టు తెలుస్తున్నది.

దక్షిణ కొరియాలో వరుసగా 2 రోజులుగా 40 పైగా కేసుల నమోదుతో టెస్టుల వేగాన్ని పెంచారు. విదేశాలనుంచి వచ్చేవారిని 2 వారాలు క్వారంటైన్‌ చేయాలని ఈ 2 దేశాలు నిర్ణయించాయి. దక్షిణాఫ్రికా లో ఉద్ధృతంగా వ్యాపిస్తున్నది. వైరస్‌ మళ్లీ వ్యాపించే అవకాశం ఉన్నదని హాంకాంగ్‌ తమ పౌరులను హెచ్చరించింది. వైరస్‌ వ్యాప్తి ఇప్పట్లో తగ్గే సూచనలేవీ కనిపించడం లేదని పోప్‌ ఫ్రాన్సిస్‌ అన్నారు.

ఈ వర్షాకాలంలో, వచ్చే చలికాలంలో వైరస్‌ వ్యాప్తి మరింత తీవ్రమవుతుందని ఐఐటీ-భువనేశ్వర్‌, ఎయిమ్స్‌ పరిశోధకులు చెప్పారు. 28 రాష్ట్రాలలో ఏప్రిల్‌-జూన్‌ మధ్య కేసుల సరళి ఆధారంగా ఈ అధ్యయనం చేశామని పేర్కొన్నారు. ‘ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే 0.99% కేసులు తగ్గుతున్నాయి. కేసుల రెట్టింపుకు దాదాపు 1.13 రోజులు ఎక్కువ టైం పడుతుంది’ అని ఐఐటీ-భువనేశ్వర్‌ శాస్త్రవేత్త వినోజ్‌ తెలిపారు.

గాలిలో తేమ శాతం పెరిగితే వైరస్‌ వృద్ధి రేటు తగ్గుతున్నట్టు, కేసుల రెట్టింపు సమయం కూడా 1.18 రోజులు పెరుగుతున్నట్టు గుర్తించామని చెప్పారు.  కాగా, రాష్ట్రాలలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం బీహార్‌, అసోం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరఖండ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన పరిస్థితులను సమీక్షించారు.