ఐక్య రాజ్య సమితి ఆర్థిక, సాంఘిక మండలి (ఈసీఓఎస్ఓసీ) ఎజెండా రూపకల్పనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికి బలమైన సందేశం పంపించారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. ఈ ఎజెండా రూపకల్పనలో భారత దేశం పాత్ర గురించి మోదీ వివరించారని జైశంకర్ ట్విటర్ వేదికగా కొనియాడారు.
‘‘భారత దేశ పాత్ర, కృషి గురించి అంతర్జాతీయ సమాజానికి బలమైన సందేశం : ఈసీఓఎస్ఓసీ ఎజెండా రూపకల్పనపై పీఎం@నరేంద్రమోదీ. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం’ – ఎవరినీ వెనుకకు వదిలిపెట్టని ఎస్‌డీజీ మూల వాగ్దానంతో ప్రతిధ్వనిస్తోంది’’ అని జైశంకర్ ట్వీట్ చేశారు. ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలని మోదీ చెప్తున్న విషయాన్ని మరొక ట్వీట్‌లో జైశంకర్ తెలిపారు.
‘‘కోవిడ్-19పై పోరును ప్రజా ఉద్యమంగా మార్చడం. 300 బిలియన్ డాలర్లకుపైగా ఆర్థిక ప్యాకేజీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కలిసి, స్వయం సమృద్ధ, సమస్యల నుంచి కోలుకునే శక్తి, సామర్థ్యాలుగల భారత దేశపు దార్శనికత. మూలాల నుంచి సంస్కరింపబడిన ఐక్యరాజ్య సమితితో, సంస్కరింపబడిన బహుళ ప్రభుత్వాల భాగస్వామ్య విధానానికి పిలుపు’’ అని రెండో ట్వీట్‌లో జైశంకర్ పేర్కొన్నారు.
మోదీ శుక్రవారం మాట్లాడుతూ, ఈసీఓఎస్ఓసీ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాలకు భారత దేశం మద్దతిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇవన్నీ భారత దేశపు ఎజెండాతో ఏ విధంగా అనుబంధం కలిగియున్నాయో వివరించారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత దేశం ముఖ్యమైన పాత్రను పోషిస్తోందని తెలిపారు. తాము దేశీయంగా చేస్తున్న కృషి ఎజెండా-2030, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) సాధనకు దోహదపడుతోందని తెలిపారు. ఈ లక్ష్యాల సాధనలో ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా తాము సహకరిస్తున్నట్లు గుర్తు చేశారు.
ఎవరినీ వదిలిపెట్టరాదనే ఎస్‌డీజీ మూల సిద్ధాంతాలు తన ప్రభుత్వం అమలు చేస్తున్న ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం’’ లో కనిపిస్తున్నట్లు తెలిపారు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బిజెపి